హైదరాబాద్; సెప్టెంబర్ 16, (way2newstv.com);
గిరిజన సంక్షేమం, మహిళా-శిశు సంక్షేమ శాఖ మంత్రిగా దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్ లో సత్యవతి రాథోడ్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. గిరిజనులలో మొట్టమొదటి మహిళా మంత్రిగా అవకాశం ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి కేసిఆర్ గారికి కృతజ్ఞతలు. నేను ఈ స్థాయిలో ఉండడానికి సహకరించిన అన్న కేటిఆర్ గారికి, వరంగల్ నాయకత్వానికి, నా వెన్నంటి ఉండే డోర్నకల్ నియోజక వర్గ ప్రజలకు శిరసు వంచి నమస్కరిస్తున్నాను.జనాభాలో సగమైన మహిళల సంక్షేమాన్నిచూసే మహిళా మరియు శిశు సంక్షేమ శాఖను, రాష్ట్రంలో అట్టడుగులో ఉన్న గిరిజనుల శాఖను నాకివ్వడం పట్ల సీఎం కేసిఆర్ గారికి ధన్యవాదాలు.
మహిళా-శిశు సంక్షేమ శాఖ మంత్రిగా సత్యవతి రాథోడ్ బాధ్యతలు స్వీకరణ
ఈ రెండు శాఖలను ఇచ్చి ఆయన నాపై పెట్టిన బాధ్యతను నెరవేర్చేందుకు నా సాయశక్తుల పనిచేస్తాను. సీఎం కేసీఆర్ మహిళలు, గిరిజనులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి, వారి కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. వీటిని లబ్దిదారులకు సరైన విధంగా చేరేందుకు ప్రభుత్వం తరపున ఒక వారధిగా పనిచేస్తాను. సమాజంలో వివక్షను ఎదుర్కొంటున్న మహిళలు, అభివృద్ధిలో కిందిస్థానంలో ఉన్న గిరిజనులు అందరితో సమానంగా, సగౌరవంగా స్వశక్తిపై జీవించే విధంగా ఈ రెండు శాఖలను సమర్ధవంతంగా నిర్వహించేందుకు నేను కృషి స్తాను. మహిళగా మహిళలు ఈ రోజు ఎదుర్కొంటున్న సమస్యలు, గిరిజన తండాలో పుట్టి, అక్కడే పెరిగి, ఇంకా అక్కడే ఉంటున్న నాకు గిరిజన గూడాలు, తండాలలోని సమస్యలు బాగా తెలుసు. వీటిని పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి ఆలోచన మేరకు, అధికారుల సహకారంతో శక్తివంచన లేకుండా పనిచేస్తాను. రాజకీయాల్లో వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు తెలిసిన విద్యలు రెండే, రెండు. ఒకటి కష్టపడి పనిచేయడం, రెండోది నిజాయితీగా ఉండడం. మరొక్కసారి నా నిజాయితీని, నా పనితనాన్ని ఈ శాఖల్లో చూపించి సిఎం కేసిఆర్ నమ్మకాన్ని నిలబెట్టేవిధంగా పనిచేస్తాను. నా బాధ్యతల స్వీకారం సందర్భంగా నన్ను ఆశీర్వదించడానికి, నన్ను ప్రోత్సహించడానికి వచ్చిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, చైర్మన్లు, నాయకులు, కార్యకర్తలు, ఉద్యోగులు, సంఘాల నేతలు, అభిమానులు, శ్రేయోభిలాషులకు మరొక్కసారి ధన్యవాదాలు తెలిపారు.