ఆన్ లైన్ లోకి వచ్చేసిన సైరా - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఆన్ లైన్ లోకి వచ్చేసిన సైరా

హైద్రాబాద్, అక్టోబరు 3 (way2newstv.com)
చేతిలో సెల్ ఫోన్ ఉంటే కోట్లు ఖర్చుపెట్టి తీసిన సినిమా నిమిషాల వ్యవధిలోనే మటాష్ అవుతోంది. దర్శకులు, నిర్మాతలు, హీరోలు, హీరోయిన్లు, వందలాది మంది టెక్నీషియన్లు పడిన కష్టానికి ఫలితం లేకుండా పోతుంది. ఎన్నో వ్యయప్రయాసలతో కష్టనష్టాలను ఓర్చుకుని సినిమా తీస్తే.. గంటల వ్యవధిలోనే ఆన్‌లైన్‌లో ప్రత్యక్షం అయిపోతుంది. చిన్న సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఇక పెద్ద సినిమాలను సైతం పైరసీ భూతం వీడటం లేదు. ఇంతకు ముందు సినిమా పైరసీ అయ్యిందంటే వార్త అయ్యేది.. ఇప్పుడు పైరసీ కాకపోతేనే వార్త అనే పరిస్థితి దిగజారింది. టెక్నాలజీని వక్రమార్గంలో ఉపయోగిస్తూ.. కొంతమంది పైరసీరాయుళ్లు ఈ వక్రమార్గాన్ని ఎంచుకుని కోట్లు గడిస్తూ నిర్మాతల్ని కోలుకోలేని దెబ్బతీస్తున్నారు.
ఆన్ లైన్ లోకి వచ్చేసిన సైరా

తాజాగా మెగాస్టార్ ‘సైరా’ చిత్రాన్ని సైతం పైరసీ భూతం కమ్మేసింది. భారీ బడ్జెట్‌తో భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ మూవీని ఆన్ లైన్‌లో లీక్ చేసేశారు. పెద్ద చిత్రాలను చెప్పి మరీ లీక్ చేస్తున్న తమిళ్ రాకర్స్ మరోసారి పంజా విసిరింది. ‘సైరా’ సినిమా ఫస్ట్‌ షో పూర్తయ్యేసరికే సినిమా మొత్తాన్ని హెచ్ డీ ఫ్రింట్‌తో ఆన్‌లైన్‌లో లీక్ చేసేసింది.ఇక థియేటర్స్‌కి వెళ్లి సినిమా చూడకుండా ఆన్ లైన్‌లో లింక్‌ల కోసం ఎదురుచూసే కొంతమంది ఈ సినిమా లింక్‌లను షేర్ చేస్తుండటంతో నిర్మాతలు ఆందోళనలో ఉన్నారు. కొంతమంది పనికట్టుకుని ఈ పైరసీ లింక్‌లను షేర్ చేస్తున్నారని అభిమానులు మండిపడుతున్నారు. చాలాచోట్ల నుండి ఫిర్యాదులు అందటంతో నిర్మాతలు జాగ్రత్త పడుతున్నారు. దయచేసి పైరసీని ప్రోత్సహించవద్దని.. పైరసీ లింకులు కనిపిస్తే  ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు. ఇప్పటికే ఆన్ లైన్‌లో చాలా లింక్స్‌ను తొలగించారు.ఇక పైరసీ లింక్స్ మాత్రమే కాకుండా.. ఇప్పటికే సోషల్ మీడియాలో ‘సైరా’ చిత్రంలోని కీలకమైన సన్నివేశాలను ఫోన్‌లో రికార్డ్ చేసి షేర్ చేస్తున్నారు. కొంతమందైతే ఫేస్ బుక్, వాట్సాప్‌, ఐఎమ్ఓలలో డైరెక్ట్ లైవ్ స్ట్రీమింగ్ ఇచ్చేస్తున్నారు. థియేటర్స్‌లో ఫోన్స్ అనుమతించడం, సరైన నిఘా లేకపోవడంతో ఈ లీక్‌ల బెదడ సినిమా విడుదలైన ప్రతిసారి ఎదురౌతూనే ఉంది.