విజయవాడ, అక్టోబరు 21, (way2newstv.com)
ఆంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్రంగా ఏర్పడి దాదాపు ఆరేళ్లు కావస్తోంది. అయితే ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని ఇప్పటి వరకూ ప్రభుత్వం నిర్వహించలేదు. చంద్రబాబు అధికారంలో ఉండగా రాష్ట్ర విభజన జరిగిన జూన్ 2వ తేదీని బ్లాక్ డే పరిగణించింది. నవనిర్మాణ దీక్షలు చేపట్టింది. అయితే ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం వచ్చాక ఏపీ అవతరణ దినోత్సవంపై ఒక క్లారిటీ వచ్చింది. నవంబరు 1వ తేదీనే ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని జరపాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను విభజించి జూన్ 2వ తేదీన నవ్యాంధ్ర ప్రదేశ్ ఏర్పడింది.
ఆరేళ్ల తర్వాత అవతరణ దినోత్సవం
అయితే రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించారని, విభజన సమయంలో స్పష్టమైన హామీలు ఇచ్చినా వాటిని అమలుపర్చడం లేదని, విభజిత ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా తీవ్ర నష్టాన్ని చవిచూడాల్సి వస్తుందని అప్పటి చంద్రబాబు ప్రభుత్వం అభిప్రాయపడింది. అందుకే రాష్ట్ర అవతరణ దినోత్సవాలను చంద్రబాబు అధికారంలో ఉన్న ఐదేళ్లు జరపలేదు.పైగా రాష్ట్ర విభజన జరిగిన జూన్ రెండో తేదీన బ్లాక్ డే గానే పాటిస్తూ నవనిర్మాణ దీక్షలను చంద్రబాబు చేపట్టారు. అన్ని జిల్లాల్లో దాదాపు వారం రోజుల పాటు నవనిర్మాణ దీక్షలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ లో అప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడింది జూన్ 8వ తేదీ కావడంతో అప్పటి వరకూ దీక్షలు చంద్రబాబు చేసేవారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఆయన జరుపుకోలేదు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో పాటు ఏపీకి జరిగిన అన్యాయాన్ని వివరించేందుకు చంద్రబాబు ఆ మార్గాన్ని ఎంచుకున్నారు.కానీ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర అవతరణ దినోత్సవం ఎప్పుడు జరపాలన్న దానిపై తర్జన భర్జన జరిగింది. 1956 నవంబరు 1వతేదీన అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. తర్వాత అక్టోబరు1న మద్రాస్ నుంచి విడిపోయి కొత్త ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. అక్టోబరు 1వ తేదీన ఏపీ అవతరణ దినోత్సవం చేయాలని కొందరు వాదించారు. అయితే జగన్ సర్కార్ మాత్రం చివరకు నవంబరు 1నే రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరపాలని నిర్ణయం తీసుకుంది. జగన్ వివాదాలను ఎక్కువ కాలం కొనసాగించకుండా తెగ్గొట్టేస్తున్నారనడానికి ఇదే ఉదాహరణ.