ఏలూరు, అక్టోబర్ 26 (way2newstv.com):
కొల్లేరు ప్రాంత లంక గ్రామాల ప్రజలు స్థానికంగా ఉపాధి కరవై జీవనోపాధి కోసం వలస బాట పడుతున్నారు. ఆగడాలలంక, చెట్టున్నపాడు తదితర గ్రామాల్లో పేద మత్య్సకార కుటుంబాల వారి పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. చేపల వేట మాత్రమే వచ్చిన వీరు నమ్ముకున్న కొల్లేరు సరస్సులో మత్స్య సంపద లేక వలస బాట పడుతున్నారు. కొల్లేరునే నమ్ముకుని చేపల వేటాడి జీవనోపాధి సాగించిన లంక గ్రామాలవాసులు ఇప్పుడు ఉన్న చోట పని లేక దూరప్రాంతాలకు వలసలు వెళ్తున్నారు. కొల్లేరులో పెరిగిన ఆక్రమణల నుంచి సరస్సును రక్షించడానికి చేపట్టిన ‘ఆపరేషన్ కొల్లేరు’ చేపల మాఫియా గుండెల్లో దడపుట్టించింది. అక్రమ చెరువులను బాంబులతో ధ్వంసం చేస్తుంటే కొల్లేరుకు మంచిరోజు వస్తుందని ఆశించారు. కానీ ప్రస్తుత పరిస్థితి దీనికి భిన్నంగా మారింది.
ఆరని కన్నీరు (పశ్చిమ గోదావరి)
సరస్సును పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామన్న ప్రభుత్వ హామీ నీటి మీద రాతలా మారింది. కొల్లేరు సరస్సులో పెరిగిన ఆక్రమణలను ధ్వంసం చేసిన అధికారులు, సరస్సును అభివృద్ధి చేయటంలో విఫలమయ్యారు. మంచినీటి సరస్సులోని కొద్ది పాటి నీటివనరులు సైతం ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న పారిశ్రామిక వ్యర్థాలు, పట్టణప్రాంతాల నుంచి వచ్చే మురుగు, రసాయన వ్యర్థాలతో కాలుష్యకాసారంగా మారుతోంది. సరస్సులో ప్రత్యేంగా పెరిగే మత్య్స జాతులు దాదాపుగా అంతరించే పరిస్థితికి చేరుకున్నాయి. రసాయనాల కారణంగా చేపల సంపద సరస్సులో వృద్ధి చెందటం లేదు. సరస్సు ప్రక్షాళన పేరిట చెరువులను ధ్వంసం చేసిన నేపథ్యంలో రంగుల లోకం చూపించిన వారంతా కనిపించకుండా పోయారు. మంచినీటి సరస్సు పరిరక్షణకు ప్రభుత్వం చేసిన ప్రయత్నాలన్నీ విఫలం అవుతున్నాయి. గ్రామంలో ఖాళీగా ఉన్న వేలది మందికి స్థానికంగా ఉపాధి (చేపల వేట) లేక బతుకుదేరువు కోసం కుటుంబాలతో సహా దూరప్రాంతాలకు వలస వెళ్తున్నారు.ఆపరేషన్ కొల్లేరు తరువాత చేయాల్సిన పనులను ప్రభుత్వం గాలికి వదిలేసింది. 77 వేల ఎకరాల అభివృద్ధికి (5వ కాంటూరు వరకు) సుమారు రూ. 950 కోట్లు అవసరమవుతాయని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్పట్లో ప్రతిపాదనలు చేశాయి. ఇవి కాకుండా సరస్సును పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి రూ. 1,600 కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు. అయితే ఇవన్నీ కాగితాలకే పరిమితమయ్యాయి. కొల్లేరులో సహజ చేపల వేటకు పరికరాల పంపిణీ, మహిళా సంఘాలకు ఉపాధి రుణాలు, తాగునీటి సౌకర్యాలు కల్పిస్తామన్న ప్రకటనలు సైతం అమలు కాలేదు. కొల్లేరు ఆపరేషన్ సమయంలో ఆందోళన వ్యక్తం చేస్తున్న లంక గ్రామాల ప్రజలకు కుటుంబానికి రూ. 25 వేలు లబ్ధి చేకూరేలా రూ. 50 వేల విలువ చేసే ఉపాధి రుణాలను మంజూరు చేశారు. వీటితో స్థానికుల ఆర్థిక పరిస్థితులు ఏమాత్రం మెరుగుపడలేదు. సంప్రదాయ చేపల వేట తప్ప ఇతర పనులు రాని కొల్లేరువాసులు తీసుకున్న రుణంతో పెట్టిన వ్యాపారాల నిర్వహణ కష్టమై నష్టాలను మిగిల్చాయి. ఖాళీగా ఉన్న కొల్లేరు భూముల్లో సంప్రదాయంగా వ్యసాయం చేసుకుందానుకున్నా అధికారులు చట్టాలు, నిబంధనలను సాకు చూపి కఠినంగా అడ్డుకుంటున్నారు. ఫలితంగా ఉపాధి కోసం పుట్టి పెరిగిన ఊరును, అయిన వారిని వదులుకుని వలస వెళ్తున్నారు.