టీ కాంగ్రెస్ లో రేవంత్ కు కలిసి రాని కాలం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

టీ కాంగ్రెస్ లో రేవంత్ కు కలిసి రాని కాలం

హైద్రాబాద్, నవంబర్ 8 (way2newstv.com)
తెలంగాణ కాంగ్రెస్‌లో, ఆ ఒక్క నాయకుడిపై అందరూ సీరియస్‌గా వున్నారు. మొన్నమొన్న వచ్చి, అంత హంగామా ఏంటి అంటూ కారాలు మిరియాలు నూరుతున్నారు. అంతేకాదు, టీపీసీసీ చీఫ్‌ ఇస్తే మాత్రం, గాంధీభవన్‌లో భూకంపమేనని హెచ్చరిస్తున్నారు. ఏకంగా అధిష్టానం దూత ఆజాద్‌ సమక్షంలోనే, గొడవలకు దిగారు. ఇంతకీ ఆ ఒక్కడిపై అందరికీ ఎందుకంత గురి టీపీసీసీ రేసులో ఆయన్ను ఎందుకు వ్యతిరేకిస్తున్నారా? ఒకవైపు ఆర్టీసీ సమ్మె, మరోవైపు తహసీల్దార్ విజయారెడ్డి హత్యతో అట్టుడికిపోతున్న నేపథ్యంలో, తెలంగాణలో కాంగ్రెస్‌ తిరిగి, మూలాలు పటిష్టం చేసుకునేందుకు పటిష్ట కార్యాచరణ పట్టాలెక్కించాలని భావిస్తోంది. హుజూర్ ‌నగర్‌ పరాజయాన్ని మరిచిపోయి, వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలని ఆలోచిస్తోంది. అయితే, ఇదే సమయంలో టీపీసీసీకి కొత్త అధ్యక్షున్ని నియమించాలని భావిస్తోంది కాంగ్రెస్ అధిష్టానం. 
టీ కాంగ్రెస్ లో రేవంత్ కు కలిసి రాని కాలం

ఇదే ఇప్పుడు కాంగ్రెస్‌లో యుద్ధానికి తెరలేపుతోంది. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీలో పరిస్థితిని సమీక్షించేందుకు హైదరాబాద్‌ వచ్చారు ఆ పార్టీ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్. అయితే, టీపీసీసీ చీఫ్‌ను ఖరారు చేసేందుకే ఆయన వచ్చారన్న ప్రచారం జరిగింది. దీంతో ఆజాద్‌ సమక్షంలో పార్టీ సీనియర్లు గొడవ గొడవ పడ్డారు. ముఖ్యంగా రేవంత్‌ రెడ్డి కేంద్రంగా, సమావేశం రసాభాసగా మారింది. ఎందుకంటే, రేవంత్‌ను టీపీసీసీ చీఫ్ చేస్తారని కొన్ని రోజుల నుంచి ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారంటూ సీనియర్ నేత వి.హనుమంతరావు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయంపై మరో సీనియర్ నేత షబ్బీర్ అలీ, వీహెచ్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ ముందే వారిద్దరూ పరస్పరం వాదులాడుకున్నారు. నిన్నగాక మొన్న వచ్చిన రేవంత్ రెడ్డికి పార్టీలో అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని, తనలాంటి సీనియర్లను అసలు పట్టించుకోవడం లేదని వీహెచ్ అభ్యంతరం తెలిపారు. అయితే వీహెచ్‌ను షబ్బీర్ అలీ వారించారు. దీంతో సమావేశం జరుగుతుండగానే మధ్యలోనే అసహనంగా వెళ్లిపోయారు వీహెచ్. రేవంత్ రెడ్డి అన్ని విషయాల్లోనూ ఆయన జోక్యం చేసుకుంటున్నారని, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా తర్వాత ఏర్పడిన హుజూర్‌నగర్ ఉప ఎన్నికల సందర్భంలో కూడా ఉత్తమ్ భార్య పద్మావతిరెడ్డి పోటీ చేస్తారని ప్రకటించినప్పుడు కూడా, రేవంత్ అభ్యంతరం వ్యక్తం చేయడంపై, వీహెచ్‌ వంటి సీనియర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనవసరంగా అధిక ప్రాధాన్యత ఇస్తున్నందుకే రేవంత్‌ రెచ్చిపోతున్నారని, ప్రగతి భవన్‌ ముట్టడి వంటి సొంత నిర్ణయాలను పార్టీపై రుద్దుతున్నారని మండిపడ్డారు. రేవంత్‌ రెడ్డిపై అందరు నేతలు సీరియస్‌గా రియాక్ట్‌ కావడంపై ఆజాద్‌ షాకయ్యారట. టీపీసీసీ రేసులో రేవంత్‌ రెడ్డి ఉన్నారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. అయితే ఇదే పదవిని కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అలాగే వి. హనుమంత రావు కూడా ఆశిస్తున్నారు. తనను టీపీసీసీ చీఫ్ చేయకపోయినా, రేవంత్‌కు కట్టబెట్టినా, పార్టీలో క్షణం కూడా ఉండనని, పరిణామాలు చూస్తారని వీహెచ్‌ చాలాసార్లు హెచ్చరించారు. అటు కోమటిరెడ్డి కూడా, తనకే ఇవ్వాలని పట్టుబడుతున్నారు. ఆజాద్‌కు కూడా ఇదే స్పష్టం చేశారు. ఒకవేళ తనకు పదవి ఇవ్వకపోతే, తమ్ముడి బాటలో బీజేపీ వైపు చూస్తానని కూడా పరోక్ష సంకేతాలు చాలాసార్లు ఇచ్చారు కోమటిరెడ్డి. మొత్తానికి తమకు ఇచ్చినా, ఇవ్వకపోయినా, పర్వాలేదు కానీ, రేవంత్‌ రెడ్డికి ఇస్తే మాత్రం ఊరుకునేదిలేదన్నట్టుగా కాంగ్రెస్ సీనియర్లు మాట్లాడుతున్నారు. ఒక్క రేవంత్‌ రెడ్డి టార్గెట్‌గా కారాలు మిరియాలు నూరుతున్నారు. టీపీసీసీ చీఫ్‌గా ఉత్తమ్‌ను మార్చాలని డిసైడైన కాంగ్రెస్ అధిష్టానం, ఎవరిని పీసీసీ పీఠంపై కూర్చోబెట్టినా భూకంపం తప్పదని టెన్షన్ పడుతోంది. అయితే, ఎవరిని ఎలా చల్లార్చాలో శతాధిక కాంగ్రెస్‌కు తెలియంది కాదు. త్వరలోనే కొత్త పీసీసీ చీఫ్‌ను నియమించి, తెలంగాణలో పార్టీని మళ్లీ గాడినపెట్టాలని ఆలోచిస్తోంది. అయితే, ఇదంతా మున్సిపల్‌ ఎన్నికల తర్వాతేనని తెలుస్తోంది. చూడాలి, టీపీసీసీ నియామకం, గాంధీభవన్‌లో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుందో.