హైద్రాబాద్, నవంబర్ 4, (way2newstv.in)
ఎయిర్ పొల్యూషన్ ప్రమాదకర స్థాయిలో ఉండడంతో ఢిల్లీ ప్రభుత్వం హెల్త్ఎమర్జెన్సీ ప్రకటించింది. ఈ సమస్య ఢిల్లీలోనే కాదు మన సిటీలో కూడా ఉంది. నగరంలో పెరుగుతున్న జనాభా, వాహనాల రద్దీ పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నాయి. చెట్లు మాయమవుతూ గాలి కాలుష్యం పెరుగుతోంది. మెట్రో నగరాల జాబితాలోని హైదరాబాద్ వాయు కాలుష్యం అధికమవుతున్న నేపథ్యంలో స్వచ్ఛమైన గాలిని అందించేందుకు బల్దియా ప్రయోగాత్మకంగా బహిరంగ ప్రదేశాల్లో ఎయిర్ ఫ్యూరిఫైయర్లను ఏర్పాటు చేయనుంది. సిటీలో గాలిని శుభ్రపరిచేందుకు వంద బహిరంగ ప్రదేశాల్లో ఎయిర్ ఫ్యూరిఫైయర్లు ఏర్పాటు చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
బొల్లారం, సనత్ నగర్ లలో డేంజరస్ లెవల్లో గాలులు
గాలిలోని విషపూరిత పదార్థాలను ఈ పరికరాలు ఫిల్టర్ చేస్తాయి. మొదటి విడతలో వంద ఏర్పాటు చేసి, ఫలితాలను పరిశీలించిన తర్వాత వీటి సంఖ్య 500 పెంచనున్నట్టు జీహెచ్‌ఎంసీ వర్గాలు చెబుతున్నాయి. దేశంలో ఢిల్లీ, ముంబయి నగరాల్లో బహిరంగ ఎయిర్ ఫ్యూరిఫైయర్లను వినియోగిస్తున్నారు. జనాభా రద్దీ, వాహన, పరిశ్రమల కాలుష్యం నగరజీవులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. శ్వాస సంబంధ ఆటంకాలను ఏర్పరచడంతో పాటు దీర్ఘకాలిక, భయంకర జబ్బులకూ దారితీస్తున్నాయి. వీటిని నివారించే చర్యల్లో భాగంగా బల్దియా ఎయిర్ఫ్యూరిఫైయర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించంది.విష రసాయనాలు వెదజల్లుతున్న కాలుష్యకారక కర్మాగారాలు, వాహనాల పొగ, దుమ్ము ధూళితో ప్రజారోగ్యానికి ప్రమాదం ఏర్పడుతోంది. బొల్లారం, సనత్నగర్, జూపార్క్, హెచ్సీయూ వంటి ఏరియాల్లో పొల్యూషన్ ప్రమాదకర స్థాయి నుంచి అతి ప్రమాదకర స్థాయికి చేరింది. దీంతో క్రానిక్ అబ్‌స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజెస్, రెస్పిరేటరీ ఇన్‌ఫెక్షన్, హార్ట్ డిసీజెస్, లంగ్ కేన్సర్ వంటివి అటాక్ అవుతున్నాయి. ముప్పును గుర్తించిన బల్దియా పరిస్థితి మరింత తీవ్రం కాకుండా ఎయిర్ ఫ్యూరిఫైర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. మొదట పొల్యూషన్ ఎక్కువగా ఉన్న ఏరియాలతో పాటు ట్రాఫిక్ రద్దీ ఉండే ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నారు. ఈ దఫా వంద చోట్ల పెట్టాలని అనుకుంటున్నారు. సక్సెస్ అయితే మరిన్ని ఏరియాలకు విస్తరించనున్నారు.ప్రతి యూనిట్ 60 అడుగుల పరిధి వరకూ గల గాలిని ఎయిర్ ఫ్యూరిఫైయర్ మెరుగపరుస్తుంది. నిమిషానికి రెండు వేల క్యూబిక్ అడుగుల గాలి (సీఎఫ్‌ఎం)ని శుభ్రపరిచే సామర్థ్యంతో ఇది పనిచేస్తుంది. ఫ్యూరిఫైయర్‌లో ఐఓటీ, ఐసీపీ అనే రెండు విభాగాలు పనిచేస్తుంటాయి. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ) టెక్నాలజీతో ప్యూరిఫైయర్లు పనిచేస్తాయి. ఇవి వాతావరణంలోకి విడుదలయ్యే కాలుష్య కారకాలను పీఎమ్ 2.5, పీఎమ్ 10, కార్బన్ మోనాక్సైడ్ (సీఓఓ), అస్థిర సేంద్రియ సమ్మేళనాలు (వీఓసీ), హైడ్రోకార్బన్లు (హెచ్‌సీ) వంటి వాటిని ఫిల్టర్ చేస్తాయి. ఐఓటీ, ఇంటిగ్రేషన్ కంట్రోల్ పానెల్ (ఐసీపీ) రిమోట్‌గా ఆయా యూనిట్లను నియంత్రించడంతో పాటు వివరాలను నమోదు చేస్తుంది.ప్రతి యూనిట్ ధర రూ. 75 వేలు ఉంటుంది. రూ.75లక్షలతో వంద యంత్రాలను ఏర్పాటు చేసేలా బల్దియా చర్యలు చేపడుతోంది. యూనిట్లను తయారీ సంస్థనే ఉచితంగా ఇన్‌స్టాల్ చేయనుంది. మొదటి ప్రాధాన్యం ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే సిగ్నల్స్ వద్ద, ఎక్కువ కాలుష్యం ఉన్న ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నారు. ఆ ఏరియాల్లో సక్సెస్ అయిన తర్వాత పెట్రోల్ బంక్‌లు, మెట్రో స్టేషన్లు, రైల్వే స్టేషన్లు వంటి ఇతర ముఖ్య ప్రదేశాల్లో ఎయిర్ఫ్యూరిఫైయర్లను ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా వంద యూనిట్లను ఏర్పాటు చేసి ఫలితాలు బేరీజు వేస్తారు. నగరంలో అనేక ప్రాంతాల్లో గాలిలో నైట్రిక్ ఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్, పరిమాణాలు పెరుగుతున్నాయి. కాలుష్య నియంత్రణ మండలి గణంకాల ప్రకారం వీటి స్థాయిలు పెరుగుతూ వస్తున్నాయి. ఆరు ప్రాంతాల్లో శాఖ ఎప్పటికప్పుడు గాలిలోని మూలకాల స్థాయిలను పరిశీలిస్తోంది.అతి చిన్న ధూళి కణాలు, విష వాయువుల మిశ్రమమే గాలి కాలుష్యం. వాహనాలు వదిలే పొగ, పరిశ్రమలు వెలువరించే విష వాయువులు, చెత్తాచెదారాన్ని ఆరుబయట మండించడం వంటి అనేక చర్యలతో ఎయిర్ పొల్యూషన్ ప్రమాదకర స్థాయికి చేరుతోంది. విషవాయువులకు రంగు, వాసనలుండవు. కలుషిత గాలిలో ప్రమాదకర కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ ఆక్సైడులు, నైట్రోజన్ చేరి మనం పీల్చే గాలిద్వారా లంగ్స్కి చేరి ఇన్ఫెక్షన్కి కారణమవుతున్నాయి. దీంతో కేన్సర్‌తో పాటు పలురకాల శ్వాసకోశ వ్యాధులతో నగరవాసులు బాధపడుతున్నారు.