కేంద్రంలో వరుస భేటీలంటూ ప్రచారం
విజయవాడ, నవంబర్ 15, (way2newstv.in)
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీలో బీజి బీజిగా గడుపుతున్నారు. శుక్రవారం ఉదయం మంగళగిరిలో జనసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డొక్కా సీతమ్మ ఆహార శిబిరాలు ప్రారంభించిన పవన్.. అనంతరం విజయవాడ చేరుకొని ఢిల్లీ వెళ్లారు. జనసేనాని ఉన్నట్టుండి హస్తినకు వెళ్లడం ఆసక్తికరంగా మారగా.. ఈ టూర్‌పై అప్పుడే రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. పార్టీ వర్గాలు మాత్రం ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకే ఆయన ఢిల్లీ వెళ్లారని చెబుతున్నపవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో పలువురు కీలక నేతలు, కేంద్ర మంత్రులతో సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లు ప్రచారం మొదలయ్యింది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పలు కీలక అంశాలు..
హస్తినకు పవన్
ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులతో పాటు పలు రాజకీయ అంశాలపై వారితో చర్చించే అవకాశం ఉందని చర్చ నడుస్తోంది. ప్రధానంగా ఏపీలో ఇసుక కొరత, భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలపై ఫిర్యాదు చేసేందుకు పవన్ సిద్దమయ్యారనే వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు తెలంగాణలో జరుగుతున్న ఆర్టీసీ సమ్మె విషయాన్ని కేంద్రమంత్రుల దృష్టికి తీసుకెళ్తారనే చర్చ జరుగుతోంది. కానీ జనసేన అధినేత ఢిల్లీ టూర్‌పై ఆ పార్టీ నుంచి ఎలాంటి అధికారక సమాచారం లేకపోవడం విశేషం.జనసేనాని గత వారం విశాఖలో నిర్వహించిన లాంగ్‌మార్చ్‌లో కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా జగన్ సర్కార్ పట్టించుకోవడం లేదని.. ఇలాగే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కేంద్రానికి ఫిర్యాదు చేస్తానని పరోక్షంగా హెచ్చరించారు. కాబట్టి పవన్ అందుకే ఢిల్లీ వెళ్లారనే చర్చ మొదలయ్యింది. మరి పవన్ కేంద్రమంత్రుల్ని కలుస్తారా లేదా.. ఇసుక కొరతపై ఫిర్యాదు చేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.