ఇద్దరు అల్లుళ్లు...రెండు దారులు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఇద్దరు అల్లుళ్లు...రెండు దారులు

విజయవాడ, డిసెంబర్ 27, (way2newstv.com)
బాలకృష్ణ రూలర్ అంటూ సినిమాల్లో బిజీగా ఉన్నారు. ఆయనకు ఏపీలో ఏమైనా పట్టడంలేదని విమర్శలు ఎటూ ఉన్నాయి. ఇక బాలయ్య అల్లుళ్ళు మాత్రం రాజకీయంగా జోరు చూపిస్తున్నారు. పెద్దల్లుడు లోకేష్ ఎటూ చంద్రబాబు పుత్రరత్నమే. ఆయన అమరావతి రాజధానిని జగన్ నిండా ముంచేశారని హాట్ కామెంట్స్ చేస్తున్నారు. రైతులకు ముంపు భయం లేదని, జగన్ మాత్రమే వారిని దొంగ దెబ్బ తీశారని కూడా ఆడిపోసుకుంటున్నారు. జగన్ మడమ తిప్పారని, మాట తప్పారని కూడా గట్టిగా తగులుకుంటున్నారు. అమరావతే రాజధానిగా ఉంచాలంటూ లోకేష్ గట్టిగానే డిమాండ్ చేస్తున్నారు.ఇక చిన్నల్లుడు శ్రీభరత్ తీరు చూస్తే భిన్నంగా ఉంది. 
ఇద్దరు అల్లుళ్లు...రెండు దారులు

శ్రీ భరత్ జై విశాఖ అనేస్తున్నారు. ఆయనకు విశాఖ రాజధానే ముద్దుగా కనిపిస్తోంది. రాజధానిగా విశాఖను నిర్ణయించడాన్ని ఆయన స్వాగతం పలుకుతున్నారు. ఇందుకు గానూ జగన్ నిర్ణయం కరెక్ట్ అంటున్నారు. ఈ మేరకు పార్టీ నేతలంతా కలసి తీర్మానం పెడితే భరత్ కూడా ఓటేసి గెలిపించేశారు. ఓ వైపు అధినేత చంద్రబాబు, మరో వైపు తోడల్లుడు లోకేష్ సైతం అమరావతి అని గొంతు చించుకుంటూంటే భరత్ మాత్రం విశాఖలోనే రాజధాని ఉండాలని నినదిస్తున్నారు.అమరావతిలో రైతులకు జగన్ తీరని అన్యాయం చేశారని, బంగారు బాతుని చంపేశారని కూడా చంద్రబాబు గుస్సా అవుతూంటే ఆయన గొంతుని బలహీనం చేసేలా అదే కుటుంబంలోని శ్రీభరత్ చేస్తున్న విశాఖ నినాదం పెద్ద ఇబ్బంది తెచ్చిపెడుతోంది. అమరావతి రైతులు కూడా ఇపుడు టీడీపీని ఏ విధంగా నమ్మాలో అర్ధం అవడం లేదనే పరిస్థితి ఏర్పడుతోంది.తెలుగుదేశం పార్టీది ఒకే స్టాండ్ అంటున్నారు కృష్ణా జిల్లాకు చెందిన టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావు. ఆయనకు అమరావతి దగ్గర కాబట్టి ఆ విధంగా అంటున్నారని ఉత్తరాంధ్ర తమ్ముళ్ళు అంటున్నారంటేనే పసుపు పార్టీలో ఎన్ని గొంతుకలో అర్ధమైపోతోంది. ఓ వైపు రాయలసీమ నేతలు కర్నూలులో హైకోర్టు స్వాగతిస్తున్నారు. ఇపుడు ఉత్తరాంధ్ర కూడా వేరే స్వరం వినిపిస్తోంది. మరి ఒకే గొంతుక ఎక్కడ బోండా అంటున్నారు వైసీపీ నేతలు. నారా వారి ఫ్యామిలీలోనే లోకేష్, శ్రీ భరత్ రెండుగా మాట్లాడుతున్న వేళ టీడీపీ స్టాండ్ ఇదీ అని చెప్పగలరా అంటున్నారు.