కడప, డిసెంబర్ 20, (way2newstv.com)
జమ్మలమడుగు రాజకీయాలు వేడెక్కాయి. జమ్మలమడుగు అంటే మొన్నటి వరకూ రెండు కుటుంబాలు మాత్రమే గుర్తుకు వచ్చేవి. ఒకటి రామసుబ్బారెడ్డి, మరొకటి ఆదినారాయణరెడ్డి. అయితే 2014 ఎన్నికల తర్వాత రెండు కుటుంబాలు ఒకటి కావడంతో ఇక ప్రత్యర్థి ఉండరని అందరూ భావించారు. కానీ వైసీపీ నుంచి పోటీ చేసిన సుధీర్ రెడ్డి విజయం సాధించడంతో రెండు కుటుంబాలకు జమ్మలమడుగులో చెక్ పెట్టినట్లయింది.2014లో వైసీపీ నుంచి విజయం సాధించిన ఆదినారాయణరెడ్డి మంత్రి పదవి కోసం తెలుగుదేశం పార్టీలో చేరారు. మంత్రి పదవిని ఇచ్చిన చంద్రబాబు పార్టీ ఆవిర్భావం నుంచి తమతో ఉంటున్న రామసుబ్బారెడ్డి కుటుంబాన్ని కేసుల నుంచి తప్పించడం కోసం రెండు కుటుంబాలను ఒక్కటి చేశారు. రామసుబ్బారెడ్డికి జమ్మలమడుగు టిక్కెట్, ఆదినారాయణరెడ్డికి కడప ఎంపీ టిక్కెట్ ఇచ్చారు.
కడపలో మళ్లీ పాత రాజకీయాలు
అయితే 2019 ఎన్నికల్లో ఇద్దరూ ఓటమి పాలయ్యారు.అంతకు ముందు రామసుబ్బారెడ్డిని ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయించి ఆ పదవిని ఆదినారాయణరెడ్డి సోదరుడికి ఇచ్చారు. 2019 ఎన్నికల అనంతరం ఆదినారాయణరెడ్డి వైసీపీ తనపై వేధింపులకు దిగుతుందని భావించి భారతీయ జనతా పార్టీలో చేరిపోయారు. బీజేపీలో ఆయన పెద్దగా యాక్టివ్ గా లేకపోయినా ఎక్కువగా బెంగళూరులోని తన వ్యాపారాలపైన దృష్టి పెట్టారని తెలుస్తోంది. జమ్మలమడుగులో ఆదినారాయణరెడ్డి కుటుంబానికి చెందిన క్యాడర్ అయోమయంలో పడింది. వీరిలో కొంతమంది ఆదినారాయణరెడ్డి వెంట బీజేపీలో చేరగా ఎక్కువమంది ఆదినారాయణరెడ్డి సోదరుల వెంట ఉన్నారు.తాజగా ఆదినారాయణరెడ్డి సోదరులు ఈ నెల 23వ తేదీన జగన్ సమక్షంలో వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ శివనాధ్ రెడ్డితో పాటుగా మాజీ ఎమ్మెల్సీ నారాయణరెడ్డిలు వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటివరకూ ఆదినారాయణరెడ్డి కుటుంబం ఒకే పార్టీలో ఉండేది. తొలుత కాంగ్రెస్, ఆ తర్వాత వైసీీపీలో ఉండేది. అయితే రామసుబ్బారెడ్డితో రాజీ విషయంలోనూ ఆది బ్రదర్స్ మధ్య విభేదాలు తలెత్తాయన్న వార్తలు అప్పట్లో వచ్చాయి. కానీ ఆదినారాయణరెడ్డి ఎమ్మెల్సీ పదవి వస్తుందని చెప్పి వారికి నచ్చ చెప్పారు.అంతేకాకుండా ఆదినారాయణరెడ్డి తన కుమారుడు రాజకీయ భవిష్యత్తు కోసమే ఎక్కువగా తపించేవారని, కుటుంబం గురించి పట్టించుకోలేదన్న బాధ కూడా ఉందంటున్నారు. కానీ మారిన పరిస్థితులకు అనుగుణగా ఇద్దరు సోదరులు ఆదినారాయణరెడ్డిని వీడి వైసీపీలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఆదినారాయణరెడ్డి జమ్మలమడుగులో ఒంటరికానున్నారు. ఆదినారాయణరెడ్డి సోదరులు వైసీపీలో చేరితే నిజంగా ఆదికి అంతకంటే షాక్ ఏముంటుంది?