న్యూఢిల్లీ, డిసెంబర్ 14 (way2newstv.com)
పౌరసత్వ చట్ట (సవరణ) బిల్లు 2019కు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోద ముద్ర వేశారు. దీంతో పౌరసత్వ (సవరణ) బిల్లు చట్టంగా మారింది. గురువారం సాయంత్రం రాష్ట్రపతి కార్యాలయం అధికారిక గెజిట్ విడుదల చేయడంతో చట్టంగా అమల్లోకి వచ్చింది. తాజా చట్టం ప్రకారం... 2014 డిసెంబర్ 31కి ముందు పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్గానిస్థాన్‌లో మతపరమైన హింసను ఎదుర్కొని దేశంలోకి వచ్చిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్శీలు, క్రైస్తవులు భారత పౌరసత్వం పొందేందుకు అవకాశం లభించింది. ఆయా దేశాల్లో మతపరమైన వేధింపుల్ని తట్టుకోలేక వచ్చిన వారికి మాత్రమే పౌరసత్వం లభించనుంది.పౌరసత్వ చట్ట బిల్లుకు లోక్‌సభ సోమవారం ఆమోదం తెలపగా, రాజ్యసభలోనూ బుధవారం గట్టెక్కింది. దీంతో రాష్ట్రపతి ఆమోదానికి దీనిని పంపగా, ఆయన కూడా ఆమోదించడంతో చట్టంగా మారింది.
ఇక అమల్లోకి పౌరసత్వ సవరణ
పౌరసత్వ సవరణ బిల్లుకు రాజ్యసభ బుధవారం ఆమోదం తెలిపింది. బిల్లుకు అనుకూలంగా 125 ఓట్లు రాగా.. వ్యతిరేకంగా 105 ఓట్లు పడ్డాయి. సోమవారం రాత్రి లోక్ సభలో ఆమోదం పొందిన ఈ బిల్లును అమిత్ షా బుధవారం రాజ్య సభలో ప్రవేశపెట్టారు. టీడీపీ, వైఎస్సార్సీపీ ఈ బిల్లుకు మద్దతు తెలపగా.. టీఆర్ఎస్ వ్యతిరేకించింది.కాంగ్రెస్, టీఎంసీ, వామపక్షాలు, డీఎంకే తదితర విపక్ష పార్టీలు ఈ బిల్లును వ్యతిరేకించాయి. లోక్ సభలోఈ బిల్లుకు మద్దతు ఇచ్చిన శివసేన.. రాజ్యసభలో ఓటింగ్‌కు దూరంగా ఉంది. ఆ పార్టీకి చెందిన ముగ్గురు ఎంపీలు సభ నుంచి వాకౌట్ చేశారు. బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలని కాంగ్రెస్, వామపక్షాల ప్రతిపాదన ఓటింగ్‌లో వీగిపోయింది. విపక్షాలు ఈ బిల్లుకు 14 సవరణలు ప్రతిపాదించగా.. అవన్నీ వీగిపోయాయి. బిల్లు పై ఓటింగ్ నిర్వహించడానికి ముందు వివిధ పార్టీలకు చెందిన 44 మంది ఎంపీలు తమ అభిప్రాయాలను వెల్లడించారు. సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు హోం మంత్రి అమిత్ షా సమాధానాలు ఇచ్చారు. ఈ బిల్లుపై 8 గంటలపాటు వాదోపవాదాలు కొనసాగాయి. లోక్ సభలో ఈ బిల్లు 334-106 ఓట్ల తేడాతో ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. రాజ్యసభలో 245 స్థానాలు ఉండగా.. ప్రస్తుతం ఐదు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. రాజ్యసభలో పౌరసత్వ బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా.. ఓటింగ్‌కు ముందు కాంగ్రెస్ పార్టీ విప్ జారీ చేసింది. ఈ బిల్లును వ్యతిరేకించిన టీఆర్ఎస్ కూడా గత ఐదేళ్లలో తొలిసారి విప్ జారీ చేసింది