ఒంగోలు, డిసెంబర్ 11, (way2newstv.com)
మార్కెట్‌లోకి కొత్త కొత్త వాహనాలు వచ్చేస్తున్నాయి. బైక్‌లు, ఆటోలు, కార్లు, జీపులు సరికొత్త హంగులతో ప్రయాణానికి, రవాణాకు వీలుగా పలు కంపెనీలు విడుదల చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొందరు వాహనదారులు తమ అవసరాలకు అనుగుణగా వాహనాలను కూడా మార్చుతూ వస్తున్నారు. గతంలో ఉన్న వాహనాలను మార్కెట్‌లో అమ్మేస్తూ కొత్తవి కొనుగోలు చేస్తున్నారు. ఇదే క్రమంలో కొందరు ఆర్థిక ఇబ్బందులతో కొత్త వాహనాలను కొనుగోలు చేయలేకపోవడం, మరి కొందరు తాత్కాలిక అవసరాలకు పాత వాహనాల వైపు చూస్తున్నారు. దీంతో సెకండ్ సేల్స్ ఊపందుకున్నాయి. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా రవాణా శాఖ లెక్కల ప్రకారం 3,71,79 వివిధ రకాల వాహనాలు ఉన్నాయి. జిల్లాలో కర్నూలు, నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరు, డోన్, ఆత్మకూరు ప్రాంతాల్లో 28 కారు, 52 బైక్ సెకండ్ సేల్ కేంద్రాలు ఉన్నాయి.
జిల్లాల్లో భారీగా సెకండ్ సేల్స్
అయితే పాత వాహనాలను కొనుగోలు చేసే సమయంలో అప్రమత్తత అవసరమని రవాణా శాఖ అధికారులు సూచిస్తున్నారు. తగిన జాగ్రత్తలు పాటించక పోవడమే పెద్ద సమస్యగా మారుతోందని, కొద్దిపాటి నిర్లక్ష్యం భవిష్యత్‌లో ఎన్నో ఇబ్బందులు తెచ్చే అవకాశం ఉందని రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు. ఫైనాన్స్ సౌకర్యం పెరగడంతో గత ఐదేళ్లలో వీటి డిమాండ్ బాగా పెరిగింది. ఈ క్రమంలోనే పాత వాహనాల మార్కెట్ కూడా బాగా పెరిగింది. గతంలో వాహనం విక్రయించే సమయంలో సేల్ లెటర్‌పై సంతకం చేస్తే కొనుగోలుదారు రవాణా శాఖ కార్యాలయంలో చలానా చెల్లించి దాన్ని మార్చుకునేవారు. సాంకేతికత అందుబాటులోకి రావడంతో ప్రస్తుతం ఈ పద్ధతికి కాలం చెల్లింది. వాహన బదిలీకి ప్రస్తుతం ఆన్‌లైన్ విధానం అందుబాటులోకి తెచ్చారు. ఈ పద్ధతిలో వాహనాన్ని ఒకరి నుంచి మరొకరి పేరిట మార్చుకోవడం చాలా సులువు. విక్రయ, కొనుగోలు దారులిద్దరూ సీఎస్‌ఈ కి వెళ్లి వాహనానికి సంబంధించిన ఆర్‌సీ, ఇన్సూరెన్స్, పొల్యుషన్ సరి్టఫికెట్, ఇద్దరి ఆధార్ కార్డ్‌లు సమరి్పంచాలి. తర్వాత ఇద్దరూ బయోమెట్రిక్ డివైస్‌తో వేలిముద్రలు వేసి.. అవసరమైన వివరాలు నమోదు చేస్తే కొనుగోలు చేసిన వ్యక్తి పేరిట వాహనం బదిలీ అవుతోంది. కేవలం పది నిమిషాల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుంది. పాత వాహనాన్ని కొనుగోలు చేసిన వ్యక్తి పేరిట బదిలీ చేయకపోతే.. తర్వాత ఏదైనా ప్రమాదం చోటు చేసుకుంటే విక్రయించిన వ్యక్తిపైనే పోలీసులు కేసు నమోదు చేసే అవకాశం ఉంది. అసాంఘిక, సంఘ విద్రోహక కార్యకలాపాలకు ఆ వాహనం వినియోగించినా.. విక్రయించిన వ్యక్తినే పోలీసులు మొదట అదుపులోకి తీసుకుంటారు. ఆయన ద్వారా కొనుగోలు చేసిన వ్యక్తిని సంఘటనకు బాధ్యుడిని చేస్తారు. నిబంధనల ఉల్లంఘనల నేపథ్యంలో రవాణా శాఖ అధికారులు విధించే అపరాధ రుసుం కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఇది కాకుండా విక్రయదారు కొత్త వాహనం కొనుగోలు చేస్తే.. 5 శాతం పన్ను అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.