తెరపైకి వస్తున్న భారతీరెడ్డి పేరు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

తెరపైకి వస్తున్న భారతీరెడ్డి పేరు

విజయవాడ, డిసెంబర్3 (way2newstv.com)
రాజకీయ నాయకుల మాటల దూకుడుకు ఎక్కడా బ్రేకులు ఉండవన్న సంగతి తెలిసిందే. వారు ఏం మాట్లాడుతారో వినాల్సిందే తప్ప ఏమీ అనలేని పరిస్థితి. ఇక రాజకీయ నాయకులు జ్యోతీష్యుల అవతారం ఎత్తేసి చాలా కాలం అయిపోయింది. అదే విధంగా మహా మునుల మాదిరిగా శాపాలు పెట్టేస్తున్నారు. సర్వ నాశనం అయిపోతావని పిల్లి శాపాలతో ఇష్టంలేని నాయకులపై గట్టిగా నోరు చేసుకుంటున్నారు. ఇక ఇప్పటి నాయకుల నోటి జోరే ఇది అనుకుంటే కాదు ఆ విషయంలో తాను నాటౌట్ అంటున్నారు విశాఖ జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు. ఆయన రాజకీయ దూకుడు ఎంతవరకూ వెళ్ళిందంటే ఇవాళా నిన్న గురించి చెప్పడంలేదు. రేపటి రోజున ఏం జరుగుతుందో మూడవ నేత్రంలో చూసినట్లుగా చెప్పేస్తున్నారు. 
తెరపైకి వస్తున్న భారతీరెడ్డి పేరు

ఈ మధ్య ఆయన మీడియా సమావేశంలో అన్న మాటలు వింటే ఆశ్చర్యపోవాల్సిందే.జగన్ సీఎం కల పదేళ్ల నాటిది. ఆయన మొత్తానికి ఎలాగో సాధించుకున్నారు. జన విశ్వాసం సంపాదించి తండ్రి వైఎస్సార్ కంటే మిన్నగా జగన్ ప్రజాభిమానాన్ని సంపాదించుకున్నారు. బంపర్ మెజారిటీతో తనని చాలా కాలం పాటు ఎవరూ కదపలేనంతగా జగన్ సీఎం సీట్లో గట్టిగా కుదురుకున్నారు. రాజకీయాల్లో తలపండినవారు సైతం జగన్ సీఎంగా కనీసం అయిదేళ్ళూ ఉంటారనే అంటారు. కానీ ఎక్కిన మొదటి రోజు నుంచి అపశకునాలు పలికే టీడీపీ నేతలు మాత్రం జగన్ రేపో నేడో గద్దెదిగిపోతాడనే మాట్లాడుతున్నారు. మొదట్లో ఇది మైండ్ గేమ్ అని అంతా అనుకున్నా చివరికి తమ్ముళ్ల ఆశ, ఆరాటం ఇదంతా అని ఇపుడు సర్దుకోవాల్సివస్తోంది. ఇక జగన్ విషయంలో అయ్యన్నపాత్రుడు ఇలాంటి జోస్యమే ఒకటి చెప్పుకొచ్చారు. జగన్ జైలుకెళ్తారని ఆయనే అనేసి ఆ సీట్లో ఆయన భార్య భారతీరెడ్డి కూర్చుంటారని తనదైన రాజకీయ జోస్యం చెప్పేశారు.ఇక జగన్ ని ముఖ్యమంత్రి పదాన్ని కలిపి చదవాడానికి టీడీపీ తమ్ముళ్ళు బాగా ఇబ్బంది పడుతున్నారని అనేక సందర్భాంలో తెలుస్తూనే ఉంది. అందుకే తరచూ జగన్ జైలుకు పోతాడని ఇప్పటిదాకా టీడీపీ మాజీ మంత్రులు అనేకమంది అంటూ వచ్చారు మరి సీనియర్ కనుక అయ్యన్నపాత్రుడు మరి కాస్తా ముందుకెళ్ళి ఆయన జైలుకు వెళ్తే భారతీరెడ్డి ముఖ్యమంత్రి అవుతారని చెప్పుకొచ్చారు. అదే సమయంలో జగన్ సీఎం సీటుపై వైసీపీలోనే అనేక మందికి కన్ను ఉందని కూడా అయ్యన్న కాస్తా రాజకీయ మసాలా కూడా దట్టించారు. అందులో ముందు వరసలో మంత్రి బొత్స సత్యనారాయణ ఉన్నారని, ఆయన జగన్ జైలుకు వెళ్ళిపోతే తాను ఆ సీటు ఎక్కాలనుకుంటున్నారని అయ్యన్న ఆరోపించడం విశేషం. అయితే బొత్స కి సీఎం సీటు ఎప్పటికీ కల మాత్రమేనని జగన్ జైలు కి వెళ్ళినా తన భార్యనే ఆ సీట్లో కూర్చోబెడతారని అయ్యన్న అంటున్నారు. మొత్తానికి రాజకీయ విమర్శలు వరకూ ఓకే కానీ ఇప్పటివరకూ బహిరంగంగా ఎక్కడా కనబడని భారతీరెడ్డిని సైతం ముగ్గులోకి లాగడమే అయ్యన్న మార్క్ రాజకీయం అనుకోవాలి.