గుంటూరు, డిసెంబర్ 21, (way2newstv.com)
వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై చర్యలకు అధిష్టానం దిగనుందా? మొన్న ఆనం రామనారాయణరెడ్డి, నేేడు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పార్టీ లైన్ ను తప్పి మాట్లాడుతుండటాన్ని వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ సీరియస్ గా తీసుకున్నట్లు సమాచారం. ఇటీవల జరిగిన అసెంబ్లీలో జగన్ మూడు రాజధానుల ప్రతిపాదనను సభ ముందు ఉంచిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై ఇప్పటి వరకూ వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరూ పెదవి విప్పలేదు.రాజధాని అమరావతికి సమీపంలో ఉన్న వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, శ్రీదేవిలు సయితం మౌనంగానే ఉన్నారు. నిజానికి రాజధాని అమరావతిని మూడుగా విభజిస్తే ఎక్కువగా నష్టపోయేది ఈ ఇద్దరు ఎమ్మెల్యేలే. తాడికొండ, మంగళిగిరి ఎమ్మెల్యేలపైనే ఈ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది.
శ్రీనివాసరెడ్డిపై జగన్ గరం..గరం
వారు మాత్రం జగన్ ప్రకటనపై ఎటువంటి వ్యాఖ్యలు ఇంతవరకూ చేయలేదు. మౌనంగానే ఉన్నారు. జగన్ నిర్ణయాన్ని తప్పుపట్టేంత సాహసం వారు చేయలేదు.కానీ నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాత్రం రాజధానుల ప్రకటనపై భిన్న స్వరం విన్పించారు. గుంటూరు జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు చాలా మంది ఉన్నా ఎవరూ పెదవి విప్పలేదు. కానీ గోపిరెడ్డి మాత్రం రాజధాని నుంచి సచివాలయం తరలించడం మంచిది కాదని అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని తాను జగన్ తో చెప్పడానికి కూడా సంకోచించనని తెలిపారు. రాజధానికి దూరంగా ఉన్న నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి విభిన్నంగా స్పందించడం పార్టీలో చర్చనీయాంశమైంది.దీనిని గుంటూరు జిల్లాకు చెందిన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు జగన్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. ఈరోజు రాజధాని రైతులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఫొటో పెట్టుకుని మరీ దీక్షలు దిగడం వైసీపీ అగ్రనేతల ఆగ్రహానికి మరింత కారణమయింది. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని వివరణ కోరాలని వైసీపీ అధిష్టానం ఆదేశించినట్లు సమాచారం. జగన్ ను కలసి వివరణ ఇచ్చుకుంటానని గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చెబుతున్నారు. మొత్తం మీద గోపిరెడ్డి వ్యాఖ్యలు పార్టీలో కలకలం రేపాయి.