చక్రబంధంలో టీడీపీ నేతలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

చక్రబంధంలో టీడీపీ నేతలు

గుంటూరు, డిసెంబర్ 21, (way2newstv.com)
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో భూములు కొనుగోలు అంశం సంచలనంగా మారింది. ఎక్కువ మంది తెలుగుదేశం పార్టీ నేతలు, చంద్రబాబు అనుచరులు, బినామీలు ఈ భూములను కొనుగోలు చేశారని వైసీపీ సర్కార్ అసెంబ్లీ సాక్షిగా కొన్ని పేర్లను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే వీరిలో అనేక మంది తాము భూములను కొనుగోలు చేసినట్లు ఒప్పుకుంటున్నారు. కానీ రాజధాని ప్రకటించిన తర్వాతనే తాము భూములను కొనుగోలు చేశామని చెప్పుకొస్తున్నారు. ప్రధానంగా తెలుగుదేశం పార్టీలో కీలక నేతలుగా ఉన్న మాజీ మంత్రులు నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావుతో పాటు జీవీ ఆంజనేయులు, ధూళిపాళ్ల నరేంద్ర తదితర నేతలు కొనుగోలు చేసినట్లు వైసీపీ సర్కార్ బయటపెట్టింది. అయితే నారాయణ మాత్రం తమ బంధువులు, సన్నిహితులు 55 ఎకరాలు కొనుగోలు చేసిన విషయాన్ని అంగీకరించారు. 
చక్రబంధంలో టీడీపీ నేతలు

తాను మూడు వేల ఎకరాలు కొనుగోలు చేసినట్లు గతంలో వైసీపీ ఆరోపించిందని, చివరకు వైసీపీ 55ఎకరాలని తేల్చిందని నారాయణ ఎద్దేవా చేశారు. రాజధానిని చంద్రబాబు ప్రకటించిన తర్వాతనే ఈ భూములు కొనుగోలు చేసినట్లు నారాయణ తెలిపారు.మరో ముఖ్యనేత జీవీ ఆంజనేయులు సయితం తనకు రాజధానిలో భూములు ఉన్న మాట వాస్తవేమనని అంగీకరించారు. అయితే తాను చట్ట ప్రకారమే కొనుగోలు చేసినట్లు చెప్పారు. ఇక ధూళిపాళ్ల నరేంద్ర అయితే తాను కొన్నానని, కొనలేదని దూళిపాళ్ల నరేంద్ర చెప్పలేదు. జగన్ టీడీపీపై కక్షతోనే మూడు రాజధానుల ప్రతిపాదన తెచ్చారని మాత్రం చెప్పుకొచ్చారు. ప్రత్తిపాటి పుల్లారావు మాత్రం తనకు రాజధానిలో సెంటు భూమిలేదని ఖండించారు. నిరూపిస్తే ఎంతటి శిక్షకైనా సిద్ధమని సవాల్ విసిరారు.ఇక కొమ్మాలపాటి శ్రీధర్, పరిటాల సునీత, పల్లె రఘునాధరెడ్డి, యనమల రామకృష్ణుడు తదితర నేతలు తమపై వచ్చిన ఆరోపణలకు కనీసం సమాధానం కూడా చెప్పలేదు. రాజధానిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందా? లేదా? అన్నది పక్కన పెడితే ఎక్కువమంది టీడీపీకి చెందిన నేతలు భూములు కొనుగోలు చేయడం వాస్తవమేనని తేలింది. వారే అంగీకరిస్తున్నారు. మరి చట్ట ప్రకారమే భూములు కొనుగోలు చేసినప్పటికీ నైతికంగా టీడీపీ ప్రజలకు జవాబు చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే టీడీపీ అమరావతి విషయంలో ఇంత రాద్ధాంతం చేస్తుందన్న ప్రచారమూ జరుగుతోంది.