కాలుష్య నగరంగా హైద్రాబాద్
హైద్రాబాద్, జనవరి 9, (way2newstv.com)
హైదరాబాద్ మరో డిల్లీ కానున్నదా? అంటే అవుననే అంటున్నారు పర్యావరణ వేత్తలు. రసాయన, ఫార్మా, పొగాకు, అద్దకం, రబ్బరు, పేయింట్, వార్నీష్ తదితర ప్రమాదస్థాయి కాలుష్యం వెదజల్లే అనేక పరిశ్రమలు నగరాన్ని చుట్టుముట్టాయి. వీటికి తోడు వాహనాల సంఖ్య రోజు రోజుకు పెరిగి పోతున్నది. 2019 చివరి వరకు ఈ సంఖ్య 60 లక్షలకు చేరుకున్నదని గణాంకాలు చెబుతున్నాయి. ప్లాస్టిక్ వ్యర్థాలతో హైదరాబాద్ నిండిపోతున్నది. ప్రతి రోజూ 5వేల నుంచి 6వేల మెట్రిక్ టన్నుల చెత్త వస్తుండగా, అందులో 5శాతం ప్లాస్టిక్ ఉంటుంది. ఫలితంగా హైదరాబాద్‌లో వాయు, నీటి కాలుష్యం సాధారణం నుంచి ప్రమాద స్థాయికి చేరుకోవడంతో ప్రజలు అనేక రోగాల బారిన పడుతున్నారు. భవిష్యత్‌లో కాలుష్యం నగర ప్రజలపై తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం ఉంటున్నదని వాతావరణ నిపుణులు అంటున్నారు.
60 లక్షలకు చేరుకున్న వాహానాలు
హైదరాబాద్ నగరంలో పెరిగిపోతున్న కాలుష్యాన్ని నివారించాలని ప్రజలు, ఆయా సంఘాలు ఆందోళన చేసిన నేపథ్యంలో ప్రమాదకర పరిశ్రమలను ఓఆర్‌ఆర్ అవతలకు తరలించాలని ప్రభుత్వం 2013 మార్చి 1న నిర్ణయించి జీవో 20ని తీసుకొచ్చింది. అప్పటి గణాంకాల ప్రకారం హైదరాబాద్ చుట్టు పక్కల కాలుష్యాన్ని వెదజల్లే రెడ్ కేటగిరికి చెందిన 803, ఆరెంజ్ కేటగిరికి చెందిన 357 పరిశ్రమలు ఉన్నాయి. వీటిని అవుటర్ రింగ్‌రోడ్ బయటకు తరలించే బాధ్యతను పర్యావరణ రక్షణ, శిక్షణసంస్థ (ఈపీటీఆర్‌ఐ)కి అప్పగించింది. ఏడేండ్లు గడిచినా పరి శ్రమల తరలింపులో ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేదు. వాటికి తోడు గడిచిన నాలుగేండ్లలో మరో 835 రెడ్, 2315 ఆరెంజ్ పరిశ్రమలు వెలిశాయి. ఈ పరిశ్రమల నుంచి వెలువడుతున్న కాలుష్యం ఎలాంటి శుద్ధి లేకుండా చుట్టు పక్కల కాలువల్లో వదులుతుండడంతో మూసి నది కాలుష్య సారంగా మారింది. అలాగే వాహనాల సంఖ్య సైతం రోజు రోజుకు పెరిగి పోతున్నది. 2019 చివరి వరకు నగరంలో వాహనాల సంఖ్య 60 లక్షలు కాగా ఇందులో 48లక్షల ద్విచక్ర, 12 లక్షల నాలుగు చక్రాల వాహనాలు ఉన్నాయి. వీటిలో కాలం చెల్లిన వాహనాల సంఖ్య 25శాతం పైగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. 2015 నుంచి హైదరాబాద్ నగరంలో ఏటా రెండు లక్షల కొత్త వాహనాలు రోడ్లపైకి వస్తున్నాయి. వాహనాల పెరుగుదల ఇలాగే ఉంటే డిల్లీలోగా సరి, బేసి సంఖ్య ఆధారంగానే వాహనాలు రోడ్లపైకి వచ్చే పరిస్థితి దగ్గర్లో ఉంటుందని భావిస్తున్నారు. మరో వైపు ప్లాస్టిక్ వ్యర్థాలతో హైదరాబాద్ నిండిపోతున్నది. జీహెచ్‌ఎంసీ అంచనా ప్రకారం వారానికి దాదాపు రెండు కోట్ల ప్లాస్టిక్ కవర్లను నగరంలో ఉపయో గిస్తున్నారు. వాడిన తర్వాత ఆ కవర్లను చెత్తకుండిల్లో, రోడ్లపైన పడేస్తున్నారు. అందులో చాలా వరకు నాలాలోకి చేరి మూసుకుపోతు న్నాయి. ఈ ప్రభావంతో డ్రయినేజీలలో నీళ్లన్నీ నిలిచిపోయి రోడ్లపై పొంగి పొర్లుతున్నాయి. దోమలు ప్రబలుతు న్నాయి. జనం రోగాల బారిన పడుతున్నారు. మరో వైపు హైదరాబాద్ నగరంలో నీరు, గాలి కాలుష్యం ప్రమాద స్థాయికి చేరుతుండడంతో ప్రజలపై తీవ్ర ప్రభావం చూపనున్నదని ఆందోళన వ్యక్తమవుతున్నది. గాలి నాణ్యతా సూచిక(ఏక్యూఐ) క్యూబిక్ మీటర్‌కు 50 నుంచి 100 ఎంజీ వరకు ఉండాలి. కాని నగరం గత ఐదేండ్ల క్రితమే సాధారణ స్థాయిని దాటి ప్రమాదకర స్థాయికి చేరుకుంది. క్యూబిక్ మీటర్ స్థాయిలో గరిష్టంగా బొల్లారంలో 179, పటాన్ చెరులో 181, పాశమైలారంలో 177, జూపార్క్‌లో 184గా సోమవారం నమోదైనట్టు పొల్యూషన్ కంట్రోల్‌బోర్డు గణాంకాలు చెబుతున్నాయి. ఫలితంగా ప్రజలకు అస్తమా, శ్వాసకోస వ్యాధులు, క్యాన్సర్లు, కిడ్నీ, బోధకాలు, చర్మ తదితర వ్యాధులు సంక్రమిస్తాయి. పరిస్థితిని చక్కదిద్ధకుంటే హైదరాబాద్ నివాసానికి పనికి రాని నగరంగా మారే అవకాశం లేకపోలేదని భావిస్తున్నారు.