శ్రీకాకుళం, జనవరి 13, (way2newstv.com)
సంక్రాంతి వస్తోందంటే పల్లెల్లో సందడి నెలకొంటుంది. ధనుర్మాస ప్రారంభం నుంచి అంటే నెలగంట పెట్టిన నాటినుంచి పల్లెల్లో ముందు పంటకోతల సందడి, ఆనక సంక్రాంతి సంబరాల ఏర్పాట్లు సందడి ఉంటుంది. చిన్నారులు భోగిపిడకలు, భోగి సందడి ఉంటే పల్లెల్లో రైతుల ముంగిట హరిదాసులు, గంగిరెద్దుల వాళ్లు, కొమ్మదాసర్లు, గంటాసాహెబ్‌లు, బుడబుక్కలవాళ్లు సందడి చేసి వారికి ఇవ్వాల్సిన తృణమో ఫణమో పొందుతూ కాలం గడుపుతారు. హరిలో రంగహరి అంటూ విష్ణునామస్మరణ చేస్తూ గ్రామాలలో సందడి చేసే హరిదాసులు నెత్తిపై పాత్రతో చిడతలతో సందడి చేస్తూ పాటలు పాడుతూ వెళ్తుంటారు. వీరు ఎవరినీ దేహీ అని అడగరు. వారిపై దయతలచి భక్తితో ఇస్తే ఆగి తీసుకుంటారు. పల్లెల్లో వీరిని ఆదరించి వీరికి ఎంతోకొంత ఇచ్చి పండగను జరుపుతారు.
సంక్రాంతికి సందడి చేస్తున్న హరిదాసులు
పండగ అయ్యాక కూడా వీరికి భోజనాలు పెట్టి పలు దానాలు చేస్తుంటారు. హరిదాసులకు సంక్రాంతి, కార్తీక సమయాలలో ఆదరణ ఉన్నా పెద్దగా గిట్టుబాటు కావడం లేదు. కొన్ని ప్రాంతాలలో అసలు విలువే ఇవ్వడం లేదు. సంప్రదాయ పరిరక్షణకు మేం కృషిచేస్తున్నా జీవనం కోసం ఇబ్బంది పడాల్సి వస్తోంది, రాముడు వలస సంక్రాంతి పండగకుముందు నుంచి పల్లెల్లో గంగిరెద్దుల సందడి ఉంటుంది. పాటలు పాడుతూ అమ్మగారికి దండం పెట్టు.. అయ్యగారికి దండంపెట్టు అంటూ గంగిరెద్దులు ఆడించేవారు వస్తుంటారు. వీరికి తమకు పండే ధాన్యం, పంటలు ఇచ్చి గంగిరెద్దులు అంటే ఈ ప్రాంతంలో సింహాచలం సింహాద్రప్పన్న అనే నమ్మకంతో వాటిని ప్రసన్నం చేసుకుంటారు. వీరికి పల్లెల్లో ఆదరణ నేటికీ ఉంది. వివాహం అయ్యాక దండలు, బట్టలు వీరికి ఇచ్చి దానం చేస్తే పుణ్యం వస్తుందని ఈ ప్రాంతాలలో భావన నెలకొంది. నడుమ భాగాన గంట వేలాడుతీసుకుని ముస్లిం మతానికిచెందిన వ్యక్తులు గంటాసాహెబ్‌లుగా ప్రసిద్ధి చెందారు. వీరు అతికొద్దిమంది మాత్రమే సంచారం చేస్తున్నారు. పల్లెల్లో ముస్లిం మతానికి చెందిన వ్యక్తులను ఆదరించి సైతాను బారినపడకుండా చేయాలని గంటాసాహెబ్‌లను కోరుతూ గ్రామీణులు వారికి దానధర్మాలు చేస్తుంటారు. పూర్వం వీరు చెట్లపై కూర్చుని కనిపించకుండా వ్యక్తుల జాతకాలను తమ వ్యంగ్యవ్యాఖ్యలతో వివరించేవారు. ఇప్పుడు చెట్లుపై కూర్చుంటే ఎవరూ పట్టించుకోకపోతుండడంతో కొమ్మను చేతితో పట్టుకుని పల్లెల్లో వేకువజామున తిరుగుతుంటారు. అక్కా,బావా చెల్లెమ్మా, అమ్మా అంటూ పల్లెల్లో పిలుస్తూ అందరి బాగోగులు అడుగుతూ వారిని ఆకట్టుకుని వారి వద్దనుంచి తృణమో ఫణమో పొందుతుంటారు. ఢమరుకంతో వేకువజామున మాత్రమే వచ్చేవారు బుడబుక్కలవారు. కనుమరుగవుతున్న ఈ తెగవాళ్లు కొద్దిప్రాంతాలలో మాత్రమే కనిపిస్తుంటారు. వేకువజామున డమరుకంతో శబ్దం చేసి మేలుకొలిపి వారికి కావలసింది అడిగి తీసుకుని దానం చేసేవారిని ఆశీర్వదిస్తుంటారు. పల్లెల్లో తంబురాలతో ధనుర్మాసంలో మేలుకొలుపులు చేస్తూ భక్తిగీతాలు ఆలపిస్తూ వీరు కనిపిస్తుంటారు. దాసరికులానికి చెందిన వీరు పల్లెల్లో తంబురాలు,అక్షయపాత్రలతో కనిపిస్తుంటారు. వీరికి ఆదరణ కొంతమేర తగ్గింది. పేదరికంలో ఉండే కళాకారులు పలురకాల దేవుళ్ల వేషధారణలతో అందరినీ అలరిస్తుంటారు. పలు ప్రాంతాలనుంచి వీరు వస్తూ 10 లేదా 15 రోజుల పాటు ఒకప్రాంతంలో ఉంటూ పలురకాల వేషాలు వేస్తూ అందరినీ ఆకట్టుకునే యత్నం చేస్తుంటారు. వీరికి రైతులు తమకు పండే ధాన్యం ఇచ్చి ఆదరిస్తారు. సంక్రాంతి పండగకు దూర ప్రాంతాల్లో నివసించేవారు పల్లెగూటికి చేరుకుంటున్నారు. పంటల అమ్మకాలలో రైతులు బిజీ అయ్యారు. ఉదయాన్నే హరిదాసులు సందడి చేస్తున్నారు. డూడూ బసవన్నల విన్యాసాలు చిన్నారులను అలరిస్తున్నాయి. కొమ్మదాసరులు, బుడబుక్కలపాటవారు, జంగమదొరలు ఆటపాటలతో సంక్రాంతికి స్వాగతం పలుకుతున్నారు.