ప్రతి మూడు వెహికల్స్ లో ఒకటి ఎగ్గొట్టుడే - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ప్రతి మూడు వెహికల్స్ లో ఒకటి ఎగ్గొట్టుడే

వైజాగ్, జనవరి 30, (way2newstv.com)
రాష్ట్రంలో సకాలంలో పన్నులు చెల్లించకుండా తిరుగుతున్న వాహనాల సంఖ్య 4.63 లక్షలకు చేరింది. అంటే రాష్ట్ర రహదారులపై తిరుగుతున్న ద్విచక్ర వాహనాలను మినహాయిస్తే, ప్రతి మూడు వాహనాల్లో ఒకటి పన్ను బకాయిపడినట్లే! వినేందుకు ఆశ్చర్యకరంగా ఉన్నా ఇది నిజం. ఈ వివరాలు రాష్ట్ర రవాణా శాఖ అధికారిక లెక్కలే వివరిస్తున్నాయి. ఇక పన్ను బకాయిలు, అపరాధ రుసుం కింద దాదాపు 181 కోట్ల రూపాయలు వసూలు కావాల్సి ఉంది. వాహనం రిజిస్టర్ చేసుకున్న సమయంలో పన్నులను రవాణా శాఖకు ఆయా వాహనాల యజమానులు చెల్లిస్తుంటారు. 
ప్రతి మూడు వెహికల్స్ లో ఒకటి ఎగ్గొట్టుడే

ద్విచక్ర వాహనాలకు ఒకసారే లైఫ్ టాక్స్ చెల్లించడం వల్ల ఆ కేటగిరీలో బకాయిలు లేవు. ఇతర వాహనాలకు సంబంధించి పన్నులను కొంతకాలం చెల్లించినా, తరువాతి కాలంలో వివిధ కారణాల వల్ల సకాలంలో చెల్లించడం లేదు. దీంతో భారీగా పన్ను చెల్లించని వాహనాలు, దీనిపై అపరాధ రుసుం భారీగా పెరిగిపోతోంది. రవాణా శాఖ విస్తృతంగా తనిఖీలు చేసి భారీగా వాహనాలను సీజ్ చేస్తున్నా వీటి సంఖ్య భారీగానే ఉంటోంది.రాష్ట్రంలో వివిధ రకాల వాహనాలు 12.86 లక్షల వరకు ఉన్నాయి. అందులో 4.63 లక్షల వాహనాలు అంటే దాదాపు మూడోవంతు పన్ను బకాయిపడ్డాయి. పన్ను బకాయిలున్న వాహనాల్లో ఎక్కువగా ఆటోలు, మోటార్ క్యాబ్‌లు, ట్రాక్టర్ ట్రెయిలర్లు, స్టేజ్ క్యారియర్లు, మ్యాక్స్ క్యాబ్‌లు ఉన్నాయి. పన్ను బకాయిల కింద దాదాపు 121 కోట్ల రూపాయలు వసూలు కావాల్సి ఉంది. అపరాధ రుసుం కింద మరో 60 కోట్లు వసూలు కావాల్సి ఉంది. భారీ మొత్తంలో పన్ను బకాయిలు వసూలు కావాల్సి ఉండటంతో రవాణా శాఖ విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తోంది. సీజ్ చేసిన వాహనాలు పార్కింగ్ చేయడం సమస్యగా మారడంతో ప్రైవేట్ స్థలాలను అద్దెకు తీసుకొని పార్కింగ్ ఫీజును చెల్లించేందుకు నిర్ణయించడం తెలిసిందే. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్న తరుణంలో భారీగా పేరుకుపోయిన బకాయిల వసూలుకు దాడులు మరింత ముమ్మరం చేయాల్సి ఉంది.