విశాఖపట్టణం, జనవరి 9, (way2newstv.com)
ఆయన విశాఖకు చెందిన ఆధ్యాత్మిక గురువు. ముక్కు మూసుకుని తపస్సు చేసుకునే స్వామీజీ. ధర్మం గురించి బోధనలు చేసే గురువు. అటువంటి స్వామీజీని ఇపుడు రాజకీయాల్లోకి లాగేస్తున్నారు. టీడీపీకి చెందిన మాజీ మంత్రి జవహర్ అయితే ఈ రాజధాని రగడ అంతా స్వామీజీ వల్లనే వచ్చిందంటున్నారు. ఆయన చెప్పడంతోనే ముఖ్యమంత్రి జగన్ ఇదంతా చేస్తున్నారని కూడా ఆరోపిస్తున్నారు. మరి స్వామీజీకి అంత పవర్ ఉందా? జగన్ ఆయన చెప్పినట్లుగానే నడచుకుంటున్నారా? అన్నది ఒక చర్చగా ముందు పెట్టారు. నిజానికి స్వామీజీకి రాజకీయాల మీద ఆసక్తి ఎక్కువగానే ఉన్నప్పటికీ జగన్ తీరు చూసుకున్నపుడు ఆయన కీలకమైన విషయాల్లో ఎవరి మాట వినరని కూడా అంటారు.జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఒకే ఒకసారి స్వామీజీ వద్దకు వచ్చారు.
వాస్తు దోషాలతోనే దూరం పెడుతున్నారా
రెండు గంటల పాటు గడిపారు. ఆ తరువాత ఆయన ఎన్నిసార్లు విశాఖ వచ్చినా కలిసింది లేదు. స్వామీజీ పుట్టిన రోజు వేడుకలకు సీఎం వస్తారని ప్రచారం జరిగినా కూడా రాలేదు, స్థానిక మంత్రులు మాత్రమే హాజరయ్యారు. జగన్ సైతం ఆశ్రమాలకు తాను తరచూ వెళ్ళడం ద్వారా అక్కడ మరోరకమైన అధికార కేంద్రాలు ఏర్పడతాయని భావించి ఆగిపోయారని అంటారు. పైగా ఆయన ఎవరినీ పెద్దగా విశ్వసించరని కూడా అంటారు. ఈ నేపధ్యంలో స్వామీజీ జగన్ ని ఎంత మేరకు ప్రభావం చేస్తారన్నది ఒక ప్రశ్నగానే ఉంది.ఇక ఇపుడు మాజీ మంత్రి జవహర్ ఆరోపిస్తున్నట్లుగా జగన్ కి జాతకాల పిచ్చి ఉందా? జగన్ జాతకాన్ని స్వామీజీ చెప్పారా? అన్నది మరో పాయింట్. అయితే జగన్ జాతకం విషయంలో అప్పట్లో స్వామీజీ ఆయనకు కొన్ని సలహా సూచనలు ఇచ్చి ఇలా చేసినట్లైతే అధికారంలోకి వస్తారని సూచించారని అంటారు. అది ఎంతవరకూ నిజమో కానీ జగన్ అధికారంలోకి మాత్రం వచ్చారు. ఇక అమరావతి విషయం తీసుకుంటే వాస్తుపరమైన దోషాలు చాలా ఉన్నాయని వాస్తు నిపుణులే గట్టిగా చెప్పారు. పైగా పర్యావరణవేత్తలు అది భూకంపాల జోన్ అని కూడా నిర్దారించారు. చంద్రబాబు అమరావతిని రాజధాని చేసినపుడు స్వామీజీ వ్యతిరేకంగా మాట్లాడింది లేదని కూడా అంటున్నారు.తూర్పు తీరంలో విశాఖ నగరం ఉంది. ఇది ప్రగతికి మారుపేరుగా ఉంది. ఇక్కడ ఏ రాజధాని లేకపోయినా హైదరాబద్ తో సమానంగా ఉండడమే కాదు, దేశంలోని పది టాప్ సిటీల్లో ఒకటిగా నిలిచింది. విభజన తరువాత విశాఖను రాజధానిగా చేసుకుంటే ఇప్పటికే ఏపీ అభివృధ్ధి చెందేదన్న భావన అందరిలోనూ ఉంది. ఇక తూర్పుకు అభిముఖంగా రాజధాని ఉండడం వల్ల లాభాలు, ప్రయోజనాలు ఉన్నాయేమో జాతకకర్తలు చెప్పాలి. అయితే విశాఖ రాజధాని పెట్టి ముఖ్యమంత్రి ఇక్కడే ఉంటే స్వామీజీకి కూడా అనందమే. బహుశా దీన్ని దృష్టిలో పెట్టుకునే మంత్రి జవహర్ ఆరోపణలు చేస్తున్నారనుకోవాలి. ఏది ఏమైనా విశాఖ విషయంలో జాతకాల కంటే భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే తమ నాయకుడు జగన్ అడుగులు వేస్తున్నారని వైసీపీ నేతలు అంటున్నారు. అలాగే స్వామీజీని ముగ్గులోకి లాగడం మంచిది కాదని కూడా అంటున్నారు.