మేడారం...మహా జాతర గా విశ్వవ్యాప్తం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

మేడారం...మహా జాతర గా విశ్వవ్యాప్తం

వరంగల్, జనవరి 23, (way2newstv.com)
ఇంతింతై... వటుడింతై అన్న చందంగా బయ్యక్కపేటలో పండగలా ప్రారంభమై మేడారం మహా జాతరగా విశ్వవ్యాప్తమైంది. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన ఉత్సవంగా పేరుగాంచింది. కోట్లాది మంది భక్తజనుల కొంగు బంగారమైంది.. వన్యమృగాల బారి నుంచి తప్పించుకొని ఎలా మొక్కులు తీర్చుకుంటామో అని చింతపడే స్థాయి నుంచి అత్యాధునిక వైఫై సేవలు, అన్ని హంగులతో విశేషంగా ఆకర్షిస్తోంది.. వనం కాస్త జనారణ్యంగా మారి.. వచ్చిన వారికి సకల సౌకర్యాలు కల్పిస్తోంది...తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, ఒడిషా రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. జాతరలో ప్రధాన భాగస్వామ్యం పంచుకుంటున్నారు. వీరికి తోడు ఈశాన్య రాష్ట్రాల నుంచి సైతం వస్తున్నారు. అమెరికా, ఆస్ట్రేలియా, జర్మనీ, కెనడా తదితర దేశాల నుంచి వచ్చి అమ్మల దీవెనలు తీసుకుంటున్నారు. ఉపాధి, ఉద్యోగాల రీత్యా విదేశాలకు వెళ్లిన ప్రవాస భారతీయులు, వారి ద్వారా మేడారం మహత్యం, కోటి మంది భక్తులు ఒకే చోట కలిసుంటే భావనతో చూడాలనే ఆసక్తి విదేశీయుల్లోనూ పెరిగింది. ప్రపంచ వ్యాప్తంగా ఏ జాతరల్లోనూ కనిపించని సంబరం మేడారంలో గోచరిస్తుంది. 
మేడారం...మహా జాతర గా విశ్వవ్యాప్తం

ఇంతటి సంబరాన్ని సోషల్ మీడియా, ఇంటర్ నెట్ ద్వారా తెలుసుకున్న విదేశీయులు సైతం మేడారం సమ్మేళనాన్ని తిలకించేందుకు వస్తున్నారంటే ఏ స్థాయిలో ప్రాచుర్యం పొందిందో అర్థం చేసుకోవచ్చు. ఇంతింతై..జగమంతై ఆసియాలోనే అతి పెద్ద జాతరగా ఆవిర్భవించింది. రెండు దశాబ్దాలుగా ప్రభుత్వాలు నిధులు కేటాయించడం, భక్తజనులకు సకల సౌకర్యాలు కల్పించడంతో గొప్ప పురోభివృద్ధిని సాధించింది.మేడారం సమ్మక్క-సారలమ్మల జాతరను పన్నెండో శతాబ్దంలోనే కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడు ప్రారంభించినట్లు కోయపెద్దలు చెబుతున్నారు. మొదట్లో మేడారానికి సమీపంలోని బయ్యక్కపేట కుగ్రామంలో జాతర జరిగేది. అప్పటి గ్రామ స్థితిగతుల కారణంగా, కోయలకు ఉత్సవం జరిపే ఆర్థిక స్థోమత లేనందున చందావంశీయులు భూపతయ్య, జోగయ్య, రామన్న మధ్యన తలెత్తిన గొడవ కారణంగా జాతర ఆగిపోయిందట. 1944 జనవరి 6న అప్పటి తహసీ ల్దార్‌బయ్యక్కపేటలో జాతర నిర్వహణకు కమిటీని నియమించారు. అయినా స్థానిక పెద్దలు జాతర నిర్వహించలేక పోయారు. చివరికి మేడారం పూజారులైన వడ్డెలకు అప్పగించారు. 1946లో జాతరను మేడారంలో నిర్వహించారు. అప్పుడు  17వేల 173 రూపాయల ఆదాయమొచ్చింది. ఆసమయంలో రాష్ట్రంలోని ఇతర ఏజెన్సీ ప్రాంతాల గిరిజనులు కూడా వచ్చినట్లుగా పెద్దలు చెప్పారు.1962 సంవత్సరంలో సమ్మక్క తల్లిని గద్దెలపై ప్రతిష్ఠించారు. అప్పటికి ఆ ప్రాంతమంతా కీకారణ్యంగా ఉండేది. భక్తులకు రవాణా సౌకర్యాలుండేవి కావు. ఎడ్లబండ్లు కట్టుకుని తరలివచ్చేవారు. మార్గమధ్యలో అడవి మృగాలు ఎదురు వచ్చేవి. భక్తుల జోలికి రాకుండా వెనుదిరిగి పోయేవట. అమ్మవారి మహిమతో ఏ ఒక్కరికీ ఎలాంటి ఆపద జరగడం లేదని భక్తుల నమ్మకం. నాటి గ్రామ జనాభా 143. అందులో 121 మంది కోయవారుండగా మిగతా 22 మంది ఇతరులు. భక్తులంతా వారి గుడిసెల చుట్టూ విడిది చేసేవారు. అనంతరం 1968 నుంచి జాతర దేవాదాయ శాఖ పరిధిలోకి వచ్చింది. అప్పడు ధర్మకర్తల మండలి అధ్యక్షుడిగా ములుగుకు చెందిన సంతోష్‌చక్రవర్తి నియమితులయ్యారు. అప్పుడే ఎంపల్లి ఎల్లారయ్య, కాక నర్సయ్య, చందా బాబూరావు, సిద్దబోయిన మునీందర్‌, సిద్దబోయిన లక్ష్మణ్‌రావు పూజారులుగా నియామకమయ్యారు.1980 సంవత్సరంలో అప్పటి కలెక్టర్‌బాపురెడ్డి చొరవతో మేడారం జాతర విశేషమైన ప్రాచుర్యం పొందింది. దాంతో జాతర ఆదాయం రికార్డు స్థాయిలో 4లక్షల 50 వేలకు చేరింది. ఆతర్వాత 1996 ఫిబ్రవరి 2న అప్పటి కలెక్టర్‌అజయ్‌మిశ్రా జాతరను రాష్ట్ర పండగగా ప్రకటించారు. 1998లో అప్పటి కలెక్టర్‌శాలినీమిశ్రా మేడారంలో 3 కోట్ల నిధులు మంజూరు చేయగా శాశ్వత నిర్మాణాలు చేపట్టి, దేవాలయం ఏర్పాటు కోసం ప్రతిపాదించినట్లుగా ఆదివాసీ పెద్దలు చెప్పారు.గతంలో జాతర సమయంలో మాత్రమే భక్తులు వచ్చి దేవతలకు మొక్కులు అప్పగించుకుని వెళ్లే వారు. ప్రస్తుతం జాతర తీరు మారింది. ఏడాది పొడవునా వచ్చి మొక్కులు అప్పగిస్తూనే ఉన్నారు. పెరిగిన వసతులు, రవాణా సౌకర్యాలతో దేశం నలు మూలల నుంచి కాకుండా విదేశాల నుంచి కూడా వస్తున్నారు. కొన్ని సంవత్సరాల కింద జాతర సమీపిస్తుండగా నెల రోజుల ముందు నుంచి భక్తులు వచ్చి వెళ్లేవారు. ఇప్పుడు 365 రోజులూ మేడారం రద్దీగా ఉంటుంది. అమ్మలను దర్శించుకుని, మొక్కులు అప్పగించుకుని  వెళ్తూనే ఉన్నారు. ఇలా జాతర దినదిన పురోభి వృద్ధిని సాధిస్తూ ఆ చల్లని తల్లుల చలువతో విశ్వవ్యాప్తమైంది.జాతర మొదట్లో ఎడ్లబండ్లే ప్రధానమైన రవాణా సౌకర్యంగా ఉండేవి. అప్పటి జిల్లా కేంద్రం వరంగల్‌కు 110 కిలో మీటర్ల దూరంలోని మేడారానికి ఆర్టీసీ సంస్థ 1970వ దశకంలో బస్సు సౌకర్యాన్ని కల్పించింది. అప్పుడు బస్సులు కొద్ది మొత్తంలో నడిచేవి. బస్సుల్లో ధనికులైనవారే వెళ్లేవారు. కాలక్రమేణా రవాణా వసతులు పెరిగాయి. రోడ్డు సౌకర్యాలు మెరుగయ్యాయి. ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాల సంఖ్య పెరిగింది. క్రమంగా ఎడ్లబండ్ల సంఖ్య తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం 2018 జాతరకు 4200 బస్సులు ఆర్టీసీ సంస్థ ఏర్పాటు చేసింది. లక్షల సంఖ్యలో కార్లు, ఇతర ప్రైవేటు వాహనాలు వచ్చి వెళ్తున్నాయి. 2010 సంవత్సరం నుంచి ప్రభుత్వం హెలీకాప్టర్‌సౌకర్యం కూడా కల్పించింది. రైలు మార్గం మినహా అన్ని రకాల రవాణా సౌకర్యాలు ముమ్మరంగా పెరిగాయి. ఇలా ఎడ్లబండ్ల స్థాయి నుంచి హెలికాప్టర్‌వరకు మేడారం జాతర దినదిన ప్రవర్థమానమవుతోంది.