ఒంగోలు, ఆగస్టు 29, (way2newstv.com)
ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయాలు వింత గొలుపుతున్నాయని అంటున్నారు ప్రతిపక్ష పార్టీల నేతలు. తాను అధికారంలో ఉంటే ఒకరకంగా, అధికారం కోల్పోతే మరో రకంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబడుతున్నారు. తాజాగా చంద్రబాబు చేసిన వ్యాఖ్య అటు కమ్యూనిస్టులు, ఇటు కాంగ్రెస్ సహా బీజేపీ నేతలను ఆగ్రహానికి గురి చేస్తున్నాయి. విషయంలోకి వెళ్తే.. ప్రస్తుతం జగన్ ప్రభుత్వం రాజధాని అమరావతి పై చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయంగా కలకలం సృష్టిస్తున్నాయి. అమరావతి రాజధాని విషయంలో గతంలో శివరామ కృష్ణ కమిటీ ఇచ్చిన నివేదికను చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదని వైసీపీ నేత, మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు.అదే సమయంలో ఆ భూములు మంచివి కావన్నారు. వరద పోటు ప్రభావం ఎక్కువగా ఉందని చెప్పారు. అదేసమయంలో కొండవీడు వాగు పొంగితే.. రాజధాని మునిగిపోవడం ఖాయమని బొత్స వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే తాము రాజధాని నిర్మాణంపై ఆచితూచి అడుగులు వేస్తున్నామని చెప్పారు.
తెరపైకి శివరామ కృష్ణ కమిటీ
దీనిని బట్టి రాజధానిని మారుస్తున్నారనే ప్రచారం ఊపందుకుంది.దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి పలువురు మంత్రులు మాట్లాడినా.. ఎవరూ కూడా ఇతమిత్థంగా రాజధాని అమరావతిలోనే ఉంటుందని చెప్పలేక పోయారు. దీంతో అక్కడి రైతులు చాలా మంది ఉద్యమానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే వారు తాజాగా చంద్రబాబును కలిసి తమ గోడు వినిపించారు. ఈ క్రమంలో రైతులతో మాట్లాడిన చంద్రబాబు అమరావతిని తరలిస్తే.. సహించేది లేదన్నారు. అదేసమయంలో రాజధానిపై ఆందోళనకు ఇతర పార్టీ నేతలతో కలిసి పోరాటం చేస్తామని వెల్లడించారు.ఇదే ఇప్పుడు ఇతర పార్టీలను ఆగ్రహానికి గురి చేసింది. చంద్రబాబు అధికారంలో ఉండగా.. ఒక్కపార్టీని కూడా దరి చేరనివ్వలేదని, ఎవరినీ కనీసం ఆయన సలహాలు సూచనలు కూడా అడగలేదని, పోనీ ఇప్పుడు వివాదానికి కారణమైన అమరావతి విషయాన్నే తీసుకున్నా.. దీనిపైనా చంద్రబాబు ఎవరినీ సంప్రదించకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని, అలాంటి సమయంలో ఇప్పుడు మా అవసరం ఎందుకని వారు అంటున్నారు. అయితే, తాము రైతుల పక్షాన మాత్రం ఉంటామని, వారికి ప్రభుత్వం అన్యాయం చేయకుండా చూస్తామని, రాజధాని విషయంలో ఇప్పటికైనా ప్రజాభిప్రాయం తీసుకుని ముందుకు వెళ్తే.. తాము సహకరిస్తామని అంటున్నారు. అంటే మొత్తానికి చంద్రబాబుకు కలిసి వచ్చేందుకు ఎవరూ సిద్ధంగా లేరనే విషయం స్పష్టంగా తెలుస్తోందని అంటున్నారు పరిశీలకులు. సో.. ఇప్పుడు ఇదీ బాబు పరిస్థితి..!
Tags:
Andrapradeshnews