కన్నడ ఎమ్మెల్యేలకు సర్కార్ ఆస్పత్రిలో చికిత్స - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కన్నడ ఎమ్మెల్యేలకు సర్కార్ ఆస్పత్రిలో చికిత్స

బెంగళూర్, జూలై 20, (way2newstv.com)
ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, వారి కుటుంబసభ్యులు ఇకపై ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే చికిత్స చేయించుకోవాలని కర్ణాటక ప్రభుత్వం నిర్దేశించింది. అలాగైతేనే ఆస్పత్రి బిల్లులు రీ-ఇంబర్స్ చేస్తామని స్పష్టం చేసింది. స్పీకర్ కె.ఆర్. రమేశ్ కుమార్ ఆదేశాల మేరకు అసెంబ్లీ కార్యదర్శి మూర్తి ఓ ప్రకటన విడుదలైంది. హెచ్‌డీ కుమారస్వామి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్ర ఖజానాకు కోట్లాది రూపాయలు మిగులుతాయని అధికారులు చెబుతున్నారు. గుండె పోటు, రోడ్డు ప్రమాదాల లాంటి అత్యవసర సమయాల్లో మాత్రమే ఎమ్మెల్యేలు, వారి కుటుంబసభ్యులు ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందవచ్చునని ప్రకటనలో వెల్లడించారు. మిగిలిన అన్ని సందర్భాల్లో ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే చికిత్స తీసుకోవాలని స్పష్టం చేశారు. ఒకవేళ ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు చికిత్స కోసం ఏదైనా ప్రైవేట్ ఆస్పత్రికి రెఫర్ చేస్తే.. అలాంటి సందర్భాల్లోనూ రీ-ఇంబర్స్‌మెంట్ వర్తిస్తుందని ప్రకటనలో తెలిపారు. ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, వారి కుటుంబసభ్యులు ప్రస్తుతం జలుబు లాంటి సాధారణ జ్వరాలకు కూడా హైటెక్ ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు. దీంతో ప్రభుత్వ ఖజానాపై భారీగా భారం పడుతోంది. దీన్ని కట్టడి చేసే క్రమంలో కుమారస్వామి ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం పట్ల ప్రజల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. ప్రభుత్వ ఉద్యోగులకు శని, ఆది.. రెండు రోజులూ సెలవులు ఇచ్చే అంశంపై కమిటీ వేసి.. కర్ణాటక సీఎం ఇప్పటికే ప్రజల మన్ననలు అందుకుంటున్నారు.
 
 
 
కన్నడ ఎమ్మెల్యేలకు సర్కార్ ఆస్పత్రిలో చికిత్స