విజయవాడ, మార్చి 13, (way2newstv.com)
సార్వత్రిక ఎన్నికల కోడ్ ప్రకటించడంతో వీఎంసీలో ప్రజా పాలన ఇక ప్రశ్నార్ధకమేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. అధికార, విపక్షాలకు ప్రతిష్టాత్మకమైన ఈ ఎన్నికలకు ప్రజాప్రతినిధులు సమాయత్తమవుతుండగా, మరోపక్క ఎన్నికల నిర్వహణ విధుల్లో అధికారులు మునిగి తేలుతుండటంతో ప్రజల గురించి పట్టించుకునే నాధుడు లేడనే చెప్పాలి. నిరుద్యోగ భృతి, పసుపు కుంకుమ, సామాజిక పెన్షన్లు, ఇలా అనేక సంక్షేమ పథకాలపై రాష్ట్ర ప్రభుత్వం పలు వరాలు కురిపించిన విషయంతో అనేక ఆశలు పెట్టుకున్న వారికి ఇక నిరాశే ఎదురవ్వకతప్పదు. ఊహించని విధంగా ఎన్నికల కోడ్ తెరమీదకు రావడంతో ఆయా పథకాల లబ్ధి కోసం వీఎంసీ కార్యాలయం చుట్టూ ప్రదిక్షిణాలు చేస్తున్న సామాన్య ప్రజానీకానికి ఇక సరైన సమాధానం చెప్పేవారే కనిపించరు. అంతేకాకుండా ఇల్లు లేని నిరుపేదలకు పీఎంఏవై ఎన్‌టిఆర్ నగర్ కింద జక్కంపూడిలో నిర్మించిన 8282 పక్కాగృహాల గృహ ప్రవేశాలు కూడా ఇక నిలిచిపోయినట్టే కనిపిస్తున్నాయి.
ఎన్నికల కోడ్ తో అటకెక్కిన సమ్మర్ వాటర్ ప్లాన్
గత నెలలో రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది పక్కాగృహాలకు సామూహిక గృహ ప్రవేశాలు జరిపినప్పటికీ నగర పేదలకు నిర్మించిన ఈ ఇళ్లకు మాత్రం గృహప్రవేశాలు జరుపలేకపోయారు. ఇందుకు కొన్ని సాంకేతిక కారణాలు అడ్డుపడగా, అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఈగృహాలకు ఉత్పన్నమైన సాంకేతిక సమస్యలను పరిష్కరించడంలో అధికారులు తగు చొరవ చూపకపోవడంతో ఇక సార్వత్రిక ఎన్నికల తరువాత, నూతనంగా ఏర్పడే ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఈ గృహాలకు గృహ ప్రవేశాలు జరుగుతాయన్నది స్పష్టంగా కనిపిస్తోంది. అలాగే గత జనవరిలో నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో వేలాది దరఖాస్తులు పాలకులకు అందాయి. సామాజిక పెన్షన్ల విలువను రెట్టింపు చేయడంతో అర్హత కలిగిన వారందరూ దరఖాస్తు చేసుకున్న వైనం గమనార్హం. ఈదరఖాస్తులను పూర్తిస్థాయిలో కార్యాచరణలో తీసుకురాలేకపోవడంతో ప్రతినిత్యం దరఖాస్తుదారులు వీఎంసీ కార్యాలయంలోని ఆయా సెక్షన్లకు వచ్చిపోతుంటారు. ఇలా చెప్పుకుంటూపోతే ప్రజలకు సంబంధించిన అనేక పనులకు ఎన్నికల కోడ్‌తో ఇక చెక్ పడినట్టే. ప్రస్తుత వేసవితోపాటు రాజకీయంగా కూడా వాతావరణం వేడెక్కుతోంది. అధికారులు ఎన్నికల విధుల్లోనూ, ప్రజాప్రతినిధులు రాజకీయ పనుల్లో మునిగితేలుతుండటం సామాన్య పౌరులకు ఇక నగర సేవలు అంతంతమాత్రమేనని చెప్పవచ్చు. అలాగే ప్రస్తుతం వేసవికి నగర పాలక సంస్థ చేపట్టే సమ్మర్ యాక్షన్ ప్లాన్ కూడా ఇక అటకెక్కినట్టేనని విషయం వేరే చెప్పనక్కర్లేదు.