జలసిరి (ఆదిలాబాద్) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

జలసిరి (ఆదిలాబాద్)

ఆదిలాబాద్, ఏప్రిల్ 22 (way2newstv.com): 
ప్రభుత్వం ఉపాధిహామీ పథకం కింద డీఆర్‌డీఓ ఆధ్వర్యంలో జల సంరక్షణ పనులను నిర్వహిస్తోంది. జిల్లా వ్యాప్తంగా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రస్తుతం నీటి నిలువ కుంటల పనులు నెల రోజులుగా చురుగ్గా కొనసాగుతున్నాయి. పలుచోట్ల ఇదీ వరకే నిర్మించిన నీటి సంరక్షణ నీటి కుంటలు, బావులు, చెరువులు, సేద్యపు కుంటలు సత్ఫలితాలనిస్తున్నాయి.జిల్లాలోని ఆయా మండలాల్లో ఉపాధిహామీ పథకం కింద నీటి సôరక్షణ పనులు ఏటా కొనసాగుతున్నాయి. 18 మండలాల్లో గతేడాది వరకు రూ.4.56 లక్షలతో సామూహిక ఇంకుడు గుంతలు 992, రూ. 38.73 లక్షలతో వ్యక్తిగత ఇంకుడుగుంతలు 5439 పూర్తయ్యాయి. రూ.1.20 కోట్లతో వ్యవసాయ బావులు 806, రూ.3.80కోట్లతో, నీటి కుంటలు 950,  రూ.4.48లక్షలతో ఊట కుంటలు 56 నిర్మించారు. ఇవే కాకుండా నీటి నిల్వ గుంతలు, చెక్‌డ్యాంలు, చెక్‌వాల్స్‌, చిన్ననీటి చెరువులు, భారీనీటి గుంతలు, పంట కాలువలు, తదితర నీటి సంరక్షణ పనులు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది రూ.12.75లక్షలతో 10,381 నీటి కుంటలను నిర్మిస్తున్నారు. అందులో 1640 పూర్తి దశకు చేరుకున్నాయి. 37 పూర్తయ్యాయి. మట్టికట్టలు, కందకాలు, చేపల కుంటలు, చెక్‌డ్యాంలు నిర్మాణం చేపడుతున్నారు.రైతుల వ్యవసాయ భూములు, అటవీప్రాంతాల్లో నీటి నిల్వ గుంతలను నిర్మిస్తారు. వర్షపు నీరు ఈ గుంతల్లోకి చేరుతుంది. దీంతో భూగర్భజలాలు పెరిగేందుకు అవకాశం ఏర్పడుతుంది. గుంతలను నిర్మించే విస్తీర్ణాన్ని బట్టి నిధులు మంజూరవుతాయి. 


జలసిరి (ఆదిలాబాద్)

వీటిని నిర్మించాలనుకునే రైతులు ఉపాధిహామీ అధికారులను సంప్రదిస్తే వారు అవసరమైన చర్యలు చేపడుతారు. ప్రస్తుతం జిల్లాలో 10,381 నీటినిలువ గుంతలు మంజూరయ్యాయి. జిల్లా పాలనాధికారి ఆదేశాల మేరకు పంచాయతీకి కనీసం 10 నీటి నిలువ గుంతలను నిర్మిస్తున్నారు. ఇంటింటా ఇంకుడు గుంతలు నిర్మించుకోవచ్చు. ఇంటి వద్ద నిర్మించుకునే వారికి రూ.4300, గ్రామాల్లో కూడలి ప్రాంతం, పాఠశాలలు, ఆస్పత్రుల్లో చేతిపంపుల వద్ద నిర్మించే సామూహిక ఇంకుడుగుంతలకు రూ.7వేలు చెల్లిస్తారు. సామూహిక ఇంకుడుగుంతలను గ్రామ పంచాయతీ, ఉపాధిహామీ శాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తారు. ఈ ఏడాది ఇంకా ఇంకుడుగుంతల కార్యక్రమం మొదలవలేదు. ఇది నిరంతరం ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు.వ్యవసాయానికి సాగు నీటి కోసం రైతులకు ఉపాధిహామీ పథకంలో భాగంగా చెరువుల నుంచి చేనుల వరకు పంట కాలువలను తవ్విస్తున్నారు. క్యూబిక్‌ మీటర్‌కు రూ.200 చొప్పున దాదాపు రూ.2లక్షల వరకు మంజూరవుతుంది. చెరువు నుంచి నేరుగా రైతు చేను వరకు కాలువ నిర్మాణాన్ని కూలీలతోనే తవ్విస్తారు. చెరువుల సమీపంలో ఉన్న భూములకు రైతుల ఆసక్తితో పాటు అవసరమైన వారికి నిర్మింపజేస్తారు.నీటి నిల్వ గుంతల్లాగే ఊట కుంటలను వ్యవసాయ భూముల్లో నిర్మించుకోవచ్చు. ఇవి ఐదు రకాలుగా చేపడుతారు. 20మీటర్లవి రూ.2.89లక్షలు, 8్ఠ8మీటర్లకు రూ.68.24వేలు, 5.55.5కు రూ.41.66వేలు, 44కు రూ.27.39వేలు, 22కు రూ.15.143 చొప్పున చెల్లిస్తారు. ఇవి ఒక చిన్న పాటి చెరువు మాదిరి ఉంటుంది. ఇవి పశువులు నీటిని తాగేందుకు ఉపయోగపడుతుంది. అత్యవసర సమయంలో పంటలకూ ఈ నీటిని తీసుకెళ్లి సాగుకు అందించవచ్చు. భూగర్భజలాలు సైతం పెరుగుతాయి. వీటిలో డగోడ్‌ఫాండ్స్‌ సైతం నిర్మింపజేస్తారు. వీటికి రూ.రూ.50వేల నుంచి రూ.లక్ష వరకు వ్యయం అవుతోంది. రైతుల పొలాల్లో ఉపాధిహామీ కూలీలతో పనులు నిర్వహిస్తారు. ఆసక్తి గల రైతులు ఉపాధిహామీ అధికారులను సంప్రదిస్తే ఊట కుంటలను నిర్మింపజేస్తారు.చెరువులు లేని గ్రామాల్లో స్థల అనూకూలతను బట్టి చిన్న చెరువులు నిర్మించుకోవచ్చు. ఉపాధిహామీ పథకం నుంచి రూ.20లక్షల వరకు నిధులు కేటాయిస్తారు. పనులు మాత్రం పూర్తిగా కూలీల చేత నిర్వహించాల్సి ఉంటుంది. బావులు, చెరువులు, నీటి కుంటలు, ఊటబావులు, సేద్యపు కుంటలు, చెక్‌డ్యాంలలో పేరుకు పోయిన మట్టి పూడిక తీత పనులు సైతం చేపడుతున్నారు. నీటిని నిలువ చేసేందుకు లోతును పెంచడానికి గానూ పూడికతీత పనులు చేపడుతారు. చేపల ఉత్పత్తి కుంటల నిర్మాణం కూడా చెరువుల సమీపంలో గల రైతులు లేక చేపల పెంపకంపై ఆసక్తి గల రైతులు చేపల నీటి కుంటలను తవ్వించుకోవచ్చు. చేపల నీటి కుంటల కోసం రూ.3లక్షల వరకు మంజూరు ఉంది. అవసరం ఉన్న వారు చెబితే కూలీల సహకారంతో చెరువుల సమీపంలో నిర్మిస్తారు. నీటి సౌకర్యం ఉంటే ఎక్కడైనా నిర్మించుకోవచ్చు.ఎత్తైన ప్రాంతం నుంచి వచ్చే వర్షపు నీరు వృథాగా పోకుండా అడ్డుకుని నిల్వ చేసేందుకు చెక్‌డ్యామ్‌లు నిర్మించుకోవచ్చు. చెక్‌డ్యామ్‌ల ప్రతిపాదనలను బట్టి నిధులను మంజూరు చేస్తారు. రూ.4లక్షల నుంచి రూ.10లక్షల వరకు నేల పరిస్థితి, నీటి నిలుపు వైశాల్యం, రైతు దరఖాస్తు చేసుకున్న దాన్ని బట్టి వ్యయం ఉంటుంది. ఇందులోనే చెక్‌వాల్స్‌ నిర్మింపజేస్తున్నారు. వీటికి రూ.2లక్షల నుంచి రూ.4లక్షల వరకు ఖర్చవుతోంది. చెక్‌డ్యాం వీలు కాని చిన్న నీటి పాయల వద్ద నీటిని నిలిపేందుకు వీటిని కడుతారు. ఈ ఏడాది పంచాయతీకి ఒక్కటి చొప్పున చెక్‌డ్యాంల నిర్మాణంకు ప్రతిపాదనలున్నాయి.