ఉద్యోగులకు జీతాలు కష్టమే - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఉద్యోగులకు జీతాలు కష్టమే

విజయవాడ,  ఏప్రిల్ 20, (way2newstv.com)
ఓవైపు తక్కువ ఆదాయం.. మరోవైపు పెరిగిన సంక్షేమ పథకాలు.. ఏపీ ఖజానాపై భారాన్ని మరింత పెంచాయి. ఆదాయ పరిమితి గురించి ఆలోచించకుండా అధికార పార్టీ అమలుచేసిన సంక్షేమ పథకాలు రాష్ట్రాన్ని ఆర్థికంగా మరింత కష్టాల్లోకి నెట్టాయంటున్నారు. రాబోయే నాలుగైదు నెలల తర్వాత ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి కూడా సరిపోయేంత డబ్బు ఖజానాలో ఉండకపోవచ్చు అంటున్నారు. ఎన్నికలకు ముందు ప్రభుత్వం అమలుచేసిన అన్నదాత సుఖీభవ, పసుపు కుంకుమ వంటి పథకాలు ఖజానాపై అదనపు భారం మోపడంతో ఈ పరిస్థితి తలెత్తిందని అంటున్నారు.సాధారణంగా ప్రతీ నెలా రూ.12వేల కోట్లు ఖజానాకు ఆదాయం సమకూరుతోంది. ఇందులో జీతాలకు రూ.4వేల కోట్లు దాకా ఖర్చవుతోంది. 


ఉద్యోగులకు జీతాలు కష్టమే

మిగతా డబ్బును ప్రభుత్వం వివిధ సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలకు ఖర్చు చేస్తోంది. కానీ ఎన్నికలకు ముందు ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలతో ఖజానాపై భారం పెరగడంతో.. ఉద్యోగుల జీతాలకు కూడా అప్పు చేయాల్సిన పరిస్థితి. దీంతో అప్పు కోసం మరోసారి ఆర్‌బీఐని సంప్రదించగా.. అక్కడి నుంచి ప్రతికూల సమాధానమే ఎదురైంది.ఆర్థిక సంవత్సరం మొదటి నెలలోనే ఇప్పటికే ఒకసారి అప్పు తీసుకుని.. ఇప్పుడు మళ్లీ అప్పు కోసం అభ్యర్థించడంపై ఆర్‌బీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆదాయం పెంచడానికి ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించకుండా.. సంక్షేమ పథకాలపై ఎక్కువ ఖర్చు చేస్తూ పోవడం ఖజానాపై భారాన్ని పెంచుతోంది. ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే.. కచ్చితంగా రాష్ట్ర ఆదాయం పెరగాల్సిందే. అయితే సంక్షేమ-అభివృద్ది పథకాల గురించి హామీలిచ్చే పార్టీలు.. ఆదాయాన్ని పెంచే మార్గాలపై మాత్రం దృష్టి పెట్టకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో ఏపీలో అటు ఉద్యోగులకు, ఇటు సంక్షేమ పథకాల అమలుకు గడ్డు కాలమే అన్న వాదన వినిపిస్తోంది. ఈ పరిస్థితిని అధిగమించడానికి రాష్ట్రంలో కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వం.. పన్నుల రూపంలో ప్రజలపై భారం మోపే అవకాశాలు కూడా లేకపోలేదు. దీంతో ఏపీ భవిష్యత్‌పై ప్రజల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది.