నటనలో తనదైన శైలిని ప్రదర్శించే హీరో ఆది పినిశెట్టి తాజాగా ఓ స్పోర్ట్స్ డ్రామాకు సంతకం చేశారు. ఈ చిత్రంతో ప్రిత్వి ఆదిత్య దర్శకుడిగా పరిచయమవుతున్నారు. స్పోర్ట్స్ జోనర్ చిత్రంలో ఆది పినిశెట్టి నటించడం ఇదే తొలిసారి. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ్‌లో ఏకకాలంలో రూపొందించనున్నారు. ఆది పినిశెట్టితో సినిమా చేసే అవకాశం వచ్చినందుకు ఆనందంగా ఉన్న దర్శకుడు ప్రిత్వి ఆదిత్య మాట్లాడుతూ ``నేను ఈ కథను రాసుకుంటున్నంత సేపూ నా మనసులో ఆదిగారే మెదిలారు.
అథ్లెట్‌గా ఆది పినిశెట్టి నటిస్తున్న ద్విభాషా చిత్రం
ఆయనకు కథ వినిపించాక, ఆయన `సరే చేస్తాను` అని చెప్పగానే నాకు చాలా రిలీఫ్‌గా అనిపించింది. ఆయనతో పనిచేయడానికి ఉత్సాహంగా ఉంది. తప్పకుండా మంచి పనితీరును కనబరుస్తాను. అథ్లెటిక్స్‌కు సంబంధించిన కథ ఇది. తను కన్న కలను సాకారం చేసుకోవడానికి కథానాయకుడు చేసిన ప్రయత్నం ఏంటనేది ఆసక్తికరంగా ఉంటుంది. అథ్లెటిక్స్ పట్ల అందరికీ ఆసక్తిని రేకెత్తిస్తుంది. ప్రస్తుతం మిగిలిన నటీనటులు, సాంకేతిక నిపుణులను ఎంపిక చేస్తున్నాం`` అని అన్నారు. ఈ చిత్రాన్ని ఐబీ కార్తికేయన్ నిర్మిస్తున్నారు. బిగ్ ప్రింట్ పిక్చర్స్ సంస్థ రూపొందిస్తోంది. పీఎంఎం ఫిల్మ్స్, జి.మనోజ్, జి. శ్రీహర్ష (కట్స్ అండ్ గ్లోరీ స్టూడియోస్) సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ప్రవీణ్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.