సభ్యులపై కోర్టు కేసులు ఉన్నా పోటికి అర్హులే:ఈసి రజత్‌కుమార్
హైదరాబాద్ మే 7 (way2newstv.com):
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నోటిఫికేషన్ వచ్చిందని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రజత్‌కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. పాత ఓటర్ల జాబితా ప్రకారమే ఓటింగ్ జరుగుతుందన్నారు. ప్రస్తుతం ఉన్న సభ్యుల పదవీకాలం జులై5తో ముగుస్తుందన్నారు. ఎలాంటి కోర్టు కేసులు లేని స్థానాలకు నోటిఫికేషన్ ఇచ్చామని చెప్పారు. త్వరలో మిగతా ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ వెలువడనుందన్నారు.
త్వరలో ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్
సభ్యులపై కోర్టు కేసులు ఉన్నా ఓటింగ్‌కు అర్హులేనని రజత్‌కుమార్ స్పష్టం చేశారు.రాష్ట్రంలో మూడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాల్లో ఉపఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం షెడ్యూల్ విడుదల చేసింది. రంగారెడ్డి, నల్గొండ, వరంగల్ నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు జరగనున్నట్లు ప్రకటించింది. మే 31న పోలింగ్ జరుగుతుందని, మే14 లోపు నామినేషన్లు దాఖలు చేయాలని, జూన్ 3న ఓట్ల లెక్కింపు జరుగుతుందని తెలిపింది. కాగా రంగారెడ్డి ఎమ్మెల్సీగా ఉన్న పట్నం నరేందర్ రెడ్డి, నల్గొండ ఎమ్మెల్సీగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఎమ్మెల్యేలుగా గెలిచినందున తమ పదవులకు రాజీనామా చేశారు. వరంగల్ ఎమ్మెల్సీగా ఉన్న కొండా మురళీధర్ రావు గతంలోనే పదవికి రాజీనామా చేశారు. దీంతో ఈ స్థానాల్లో ఉపఎన్నికలు అనివార్యమయ్యాయి.