నీరు భద్రమేనా...? (గుంటూరు) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

నీరు భద్రమేనా...? (గుంటూరు)

గుంటూరు, మే 17  (way2newstv.com): 
జిల్లాలో గుంటూరు కార్పొరేషన్ సహా మున్సిపాలిటీల్లో నీటి వనరులు అడుగంటాయి. సామర్థ్యం మేరకు బ్యారేజీలో నీటి నిల్వలు ఉండటం లేదు. దీంతో నీళ్లలో మట్టి, బురద, ఇసుక వంటి లవణాలు కలిసి సరఫరా అవుతున్నాయని పురవాసులు మొత్తుకుంటున్నారు. ఇటీవల గుంటూరు నగరపాలికలో క్లోరిన్‌ శాతం తగ్గుముఖం పట్టినట్లు ఆయా ప్రాంతాల్లో నీటి నాణ్యత పరీక్షల్లో బయటపడింది. శివారు ప్రాంతాలకు వెళ్లేసరికి క్లోరిన్‌ నిర్దేశితం ఉండక బ్యాక్టీరియా, ఫంగస్‌ వంటి విష క్రిములతో నీళ్లు వస్తున్నాయని నగరపాలిక ఇంజినీరింగ్‌ వర్గాలు ప్రయోగశాల ఫలితాలను వెల్లడించారు.గుంటూరు నగరంలో నల్లచెరువు జీరోలైను, కన్నావారితోటలోని 2వ లైను, పొత్తూరివారితోట 6వ లైను, ఇజ్రాయిల్‌పేట, గుంటూరువారితోటలో నీటి నాణ్యత పరిశీలించగా క్లోరిన్‌ శాతం తగ్గుముఖం పట్టినట్లు పరీక్షల్లో వెల్లడైంది. ప్రస్తుతం నగరంలో యూజీడీ అభివృద్ధి పనులు అంతగా జరగటం లేదు. అయినా నీళ్లలో క్లోరిన్‌, ఆమ్లత్వం లోపిస్తోందంటే తగు పాళ్లలో బ్లీచింగ్‌, సున్నం, పటిక వంటివి మిశ్రమం చేయటం లేదా? అనేది యంత్రాంగమే గుర్తెరగాలి. అసలే వేసవి కావటంతో నీటి నాణ్యతలో తేడాలు వస్తే వాటిని తాగిన వారు వాంతులు, విరేచనాలకు గురై అనారోగ్యం బారిన పడతారు. గతేడాది పాతగుంటూరు ప్రాంతంలో నీటి కలుషితం వల్ల 20 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. 


చుక్క నీరు లేదు (వరంగల్)

ఆ ఘటన నుంచి ఇంకా నగరపాలక, ప్రాంతీయ ప్రజారోగ్య ప్రయోగశాల అధికారులు గుణపాఠాలు నేర్చుకున్నట్లు లేదు.గుంటూరు వైద్య కళాశాలలోని రీజనల్‌ లేబొరేటరీలోని శాంపిల్‌ టేకర్లు, ఇతర సిబ్బంది నగరంలో సాధ్యమైనంత వరకు ఎక్కువ నమూనాలు తీసుకుని వాటిని పరీక్షించి చూడాలి. ఇక్కడ ప్రయోగశాలలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. ఉన్న సిబ్బంది కూడా పకడ్బందీగా పరీక్షల నిర్వహణకు పూనుకోవటం లేదనే విమర్శలు ఉన్నాయి. సిబ్బంది కొరతతో మొక్కుబడిగా పరీక్షలు నిర్వహిస్తూ ఏ పురపాలికలో నీటి కలుషితం జరుగుతోంది? ఎక్కడ క్లోరిన్‌ తగ్గిందో కూడా అప్రమత్తం చేయటం లేదు. గుంటూరు నగరపాలిక సిబ్బందే తరచుగా ప్రాంతీయ ప్రజారోగ్య ప్రయోగశాలకు రిజర్వాయర్లు, ఫిల్టరేషన్‌ పాయింట్లు, ఎండ్‌ యూజర్ల వద్ద నీటి శాంపిళ్లు తీసి తీసుకెళ్తే పరీక్షలు చేసి ఇస్తున్నారు. నగరంలో రోజుకు 20 నుంచి 30 పాయింట్లలో వారు తనిఖీలు చేయాల్సి ఉంటే పది, పదిహేను పాయింట్లలో నమూనాలు తీసి నగరంలో నీటి నాణ్యత బాగానే ఉందని ధ్రువీకరిస్తూ నివేదికలు పంపటం ప్రాంతీయ ప్రయోగశాల తీరుగా మారింది. నగరంలో నూతన, పాతవి కలిపి మొత్తం 42 రిజర్వాయర్లు అందుబాటులోకి వచ్చాయి. అదేవిధంగా సంగంజాగర్లమూడి, అడవితక్కెళ్లపాడు, ఉండవల్లి, వెంగళాయపాలెం వంటి చోట్ల నీటి వనరులు ఉండటంతో అక్కడకు వెళ్లి నమూనాలు సేకరించాలి. అయితే తమకు సిబ్బంది లేరని, నగరపాలిక సిబ్బందినే నమూనాలు తీసి పట్టుకొస్తే తాము పరీక్షలు చేసి ఇస్తామని నమ్మబలుకుతున్నారు. ఇప్పటికైనా ప్రయోగశాల పనితీరుపై ఉన్నతాధికారులు దృష్టి సారించాలి. ఈ ప్రయోగశాల పరిధిలోకి గుంటూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాల మున్సిపాలిటీలు వస్తాయి.నగరపాలికల్లో అయితే నిత్యం నీటి నమూనాలు తీసి పరిశీలించాలి. అదే పురపాలికల్లో అయితే ప్రతి మూడు నెలలకు ఒకసారి ప్రయోగశాల సిబ్బంది వెళ్లి నమూనాలు తీసుకొచ్చి పరీక్షలు నిర్వహించాలి. గుంటూరు నగరపాలికలోనే ఉంటూ వారు నగరంలో నమూనాలు తీయటానికే సిబ్బంది కొరత అంటూ నగరపాలిక సిబ్బందితో నమూనాలు రప్పించుకుని పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఒకవైపు పరిస్థితి ఇలా ఉంటే నాలుగు జిల్లాల పరిధిలోని పురపాలికలకు ఈ సిబ్బంది వెళ్లి నీటి నమూనాలు సేకరించి పకడ్బందీగా పరీక్షలు నిర్వహించటం ఏ మేరకు సాధ్యమో ఉన్నతాధికారులు ఆలోచించాలి. ఆయా పురపాలికల నుంచి నీటి నమూనాలు తీసుకురావాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. ఈ జిల్లాల పరిధిలో శుద్ధినీటి ప్లాంట్లను కూడా వీరు తనిఖీ చేస్తారు. ఆ ప్లాంట్లలో తనిఖీలకు బాగా ప్రాధాన్యం ఇస్తున్నారనే విమర్శలు లేకపోలేదు. ఆయా ప్లాంట్లకు తనిఖీలకు వెళ్లగానే సంబంధిత యాజమాన్యాలు లోపాలు బయటపడతాయని భయపడి ముందుగానే వారిని మచ్చిక చేసుకుని ఆ మేరకు అనుకూలమైన నివేదికలు పొందుతున్నారని సమాచారం. గతేడాది పిడుగురాళ్ల పురపాలికలో రెండు, మూడు మినరల్‌ ప్లాంట్లలో క్లోరిన్‌, ఆమ్లత్వం తగ్గి తాగటానికి పనికిరాకుండా ఉన్నాయని విజిలెన్స్‌ బృందాలు గుర్తించి నివేదికలు పంపితే తప్ప సంబంధిత పురపాలక యంత్రాంగం అప్రమత్తం కాలేదు. ఇలా ప్రతి పురపాలికలో నీళ్ల విషయంలో ఏదో ఒక లోపం కొట్టొచ్చినట్లు ఉంటోందని, వాటిని నిర్లక్ష్యం చేస్తే చివరకు గతేడాది గుంటూరులో అతిసారం విజృంభించినట్లు మిగిలిన పురపాలకల్లో వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదని ఇంజినీరింగ్‌ వర్గాలు అంటున్నాయి.