సొంత జిల్లాల్లో తిరుగుబాటు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

సొంత జిల్లాల్లో తిరుగుబాటు

తిరుపతి, జూలై 18, (way2newstv.com)
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు పార్టీపై పట్టు కోల్పోయారా? ఇటీవల జరిగిన ఎన్నికల్లో దారుణ ఓటమి తర్వాత ఆయనను పార్టీ నేతలు ఎవరూ లేక్క చేయడం లేదా? అంటే అవుననే అనిపిస్తుంది. సీనియర్ నేతలు సయితం చంద్రబాబునాయుడికి ప్రస్తుత పరిస్థితుల్లో అందుబాటులో లేకుండా పోయారన్న టాక్ పార్టీలో బాగానే విన్పిస్తుంది. చంద్రబాబునాయుడు రాజకీయ జీవితంలో గతంలో ఎన్నడూ చూడని సంక్షోభాన్ని పార్టీలో చూస్తున్నారన్నది ఒక టీడీపీ సీనియర్ నేత అభిప్రాయం.చంద్రబాబునాయుడు ఒక కోటరీ గుప్పిట్లో చిక్కుకుని ఎన్నికలకు ముందు తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారన్నది పార్టీలో బలంగా విన్పిస్తున్న టాక్. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ పై పోరాటాన్ని చంద్రబాబునాయుడు వ్యక్తిగతంగా తీసుకోవడం వల్ల ఇప్పుడు అన్ని రకాలుగా నష్టపోవాల్సి వస్తుందంటున్నారు.
సొంత జిల్లాల్లో తిరుగుబాటు

చంద్రబాబునాయుడు ఏకపక్షంగా ధర్మపోరాట దీక్షలు చేయడం వల్ల ఒరిగిందేమీ లేకపోయినా ఇప్పుడు కేంద్రంలో ఉన్న బీజేపీకి ప్రధాన శత్రువుగా మారాల్సి వచ్చిందన్న అభిప్రాయం పార్టీలో వ్యక్తమవుతోంది.ఎన్నికలలో ఓటమి తర్వాత చంద్రబాబునాయుడు పార్టీలో జరుగుతున్న పరిణామాలను చూస్తూ ఊరుకుంటున్నారే కాని ఎటువంటి చర్యలు తీసుకోక పోవడానికి కారణంపై కూడా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా కేశినేని నాని, బుద్దా వెంకన్నల మధ్య జరుగుతున్న వివాదాన్ని పరిష్కరించడానికి చంద్రబాబునాయుడు ప్రయత్నించకపోవడం ఆయన నిస్సహాయతకు నిదర్శమని చెబుతున్నారు. పార్టీ ఓటమితో పాటు బలమైన నాయకులందరూ వరసగా పార్టీని వీడుతుండటంతో ఆయన నాయకత్వంపై అపనమ్మకం ఏర్పడిందన్నది పార్టీలో ప్రధానంగా చర్చ జరుగుతోంది.కాని చంద్రబాబునాయుడు గతంలోనూ అనేక ఓటములను చూశారు. కానీ ఎప్పుడూ ఇంత నిస్సహాయతగా లేరు. తెలుగుదేశం పార్టీ అంటేనే క్రమశిక్షణతో ఉన్న పార్టీ అంటారు. కానీ పార్టీ ఇటీవల కాలంలో గాడి తప్పినట్లే కన్పిస్తుంది. అనేక మంది నేతలు పార్టీకి వ్యతిరేకంగా బహిరంగంగా వ్యాఖ్యలు చేస్తున్నా చంద్రబాబునాయుడు క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం లేదు. మొత్తం మీద ఒక్క ఓటమి చంద్రబాబునాయుడిని ఎంత నిస్సహాయతకు గురిచేసిందన్నది పార్టీలో చర్చగా మారింది.