ఏపీలో టీడీపీ కాళ్లపై బీజేపీ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఏపీలో టీడీపీ కాళ్లపై బీజేపీ


గుంటూరు, జూలై 18, (way2newstv.com)
ఏపీలో ఎద‌గాల‌ని నిర్ణయించుకున్న జాతీయ పార్టీ బీజేపీ.. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. వ‌చ్చిన వారిని వ‌చ్చిన‌ట్టు పార్టీలోకి చేర్చుకుని ముందుకు సాగాల‌ని నిర్ణయించింది. ఈ క్రమంలోనే బ‌ల‌హీనంగా ఉన్న పార్టీల్లో బ‌ల‌మైన పారిశ్రామిక వేత్తలుగా ఉన్న వారిని న‌యోనో భ‌యానో.. పార్టీలోకి చేర్చుకుంటున్నారు. అయితే, దీని వెనుక చాలానే వ్యూహం ఉన్నట్టు తెలుస్తోంది. టీడీపీ నుంచి నాయ‌కుల‌ను తీసుకోవ‌డం వెనుక‌, రాబోయే రోజుల్లో ఏపీలో టీడీపీ పూర్తిగా బీజేపీకి మ‌ద్దతు ప‌లుకుతుంద‌ని, ప్రస్తుతం అధికారంలో ఉన్న జ‌గ‌న్‌ను అన్ని విధాలా అడ్డుకునేందుకు మార్గాన్ని సుగమం చేసుకునేందుకు ఇంత‌కు మించిన మార్గం లేద‌ని చంద్రబాబు భావిస్తున్నట్టు స‌మాచారం.ఈ నేప‌థ్యంలో గ‌తంలో చెలిమి చేసిన పార్టీని వ‌దులుకునే ఉద్దేశం లేక పోవ‌డంతో ఆయ‌న ప‌రోక్షంగా ఇలా ఎపిసోడ్‌కు తెరదీశార‌ని అంటున్నారు. 
ఏపీలో టీడీపీ కాళ్లపై బీజేపీ

ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ బ‌ల‌హీనంగా ఉంది. చంద్రబాబుపై న‌మ్మకం ఉన్నా.. పార్టీలో కేడ‌ర్ నిస్తేజంగా ఉండ‌డం, ఎక్కడిక‌క్కడ ప్రజ‌ల నుంచి పెద్దగా స్పంద‌న లేక పోవ‌డంతో నాయ‌కులు పార్టీ మారేందుకు రెడీ అయ్యారు. అయితే, దీనిని త‌న‌కు అనుకూలంగా మార్చుకునేందుకు చంద్రబాబు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.మ‌రీ ముఖ్యంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీని ఇరుకున పెట్టాలంటే.. కేంద్రం నుంచి ద‌న్ను అవ‌స‌ర‌మ‌నే విష‌యం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఈ నేప‌థ్యాన్ని త‌న‌కు అడ్వాంటేజ్‌గా తీసుకుంది బీజేపీ. ఇక‌, ఇప్పటికే గుంటూరులోని క్షేత్రస్థాయి నాయ‌కులు పార్టీ మారిపోయారు. మ‌రీ ముఖ్యంగా గుర‌జాల‌, వినుకొండ, పెద‌కూర‌పాడు నియోజ‌క‌వ‌ర్గాల‌కు చెందిన పార్టీ కేడ‌ర్ పూర్తిగా బీజేపీకి జై కొట్టింది. ఇక‌, దీనిని అడ్డు పెట్టుకుని కీల‌క నాయ‌కులు కూడా త్వర‌లోనే పార్టీ మారుతార‌నే ప్రచారం జ‌రుగుతోంది. ఇలా టీడీపీని నిర్వీర్యం చేయ‌డం ద్వారా.. రాష్ట్రంలో బీజేపీ సొంత కాళ్లపై కాక‌పోయినా.. టీడీపీ కాళ్లపై అయినా నిల‌బ‌డే ఛాన్స్ ఉంటుంది. అదే స‌మ‌యంలో టీడీపీ డిమాండ్ చేస్తున్న ప్రత్యేక హోదా అంశాన్ని ప‌క్కకు పెట్టేందుకు అవ‌కాశం ఉంటుంది. ఇక ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం హోదా విష‌యంలో ప‌ట్టు ప‌ట్టిన‌ట్టు ఉన్నా.. ప‌ట్టు విడిచేసింద‌నే విమ‌ర్శలు జోరందుకున్నాయి. ఇలా మొత్తానికి రాష్ట్రంలో ఓ త‌ట‌స్థ పూరిత వాతావ‌ర‌ణాన్ని క్రియేట్ చేసి,. త‌ద్వారా బీజేపీ లబ్ది పొందాల‌ని భావిస్తున్నట్టు తెలుస్తోంది.