భారీగా తగ్గిన నీటి నిల్వలు 70-120 అడుగులు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

భారీగా తగ్గిన నీటి నిల్వలు 70-120 అడుగులు

నెల్లూరు, ఆగస్టు 13, (way2newtv.com)
కాస్తో కూస్తో ఆదుకుంటుందనుకున్న నైరుతి  ఏడాదిలానే ఈ ఏడాది కూడా మొండిచేయి చూపి తనదారి తాను చూసుకుంది. బంగాళాఖాతంలో ఏర్పడుతున్న ఏ అల్పపీడనం చూపు కూడా నెల్లూరు వైపు పడనంటోంది. ఇక ఈశాన్యంపైనే భారం మోపి ప్రస్తుతం అతిథిలా వచ్చిన కరవుకు, కర్షకులకు తోడు జిల్లా వాసులందరూ కన్నీటి స్వాగతం పలికి బతుకును బరువుగా లాగిస్తున్నారు. లక్షలాది ఎకరాల్లో సేద్యానికి నీళ్లులేక వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు. సాగునీటితో పాటు తాగునీటికి కూడా జిల్లావాసులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. మూడేళ్లుగా వరుస కరవును ఎదుర్కొంటున్న జిల్లా ఈ ఏడు తీవ్ర నీటి సంక్షోభానికి గురైంది. ఎంతో కొంత కురుస్తాయని భావించిన నైరుతి రుతుపవనాల నుంచి ఆశించినంత వర్షపాతం జిల్లాకు అందలేదు. 50 శాతానికిపైగా లోటు వర్షపాతం జిల్లాలో ఈ ఏడాది నమోదైంది. దీంతో భూగర్భ జలాలు 70-120 అడుగుల లోతుకు అడుగంటాయి. 
భారీగా తగ్గిన నీటి నిల్వలు 70-120 అడుగులు

డెల్టాలోనూ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. డెల్టా పరిధిలోని సంగం, బుచ్చి, అల్లూరు, నెల్లూరు, టీపీ గూడూరు, ఇందుకూరుపేట మండలాల్లోని 40 ప్రధాన రిజర్వాయర్లలో నీరు అడుగంటిపోయింది. ఇక జిల్లాలోని 1192 గ్రామాల పరిధిలో ఉన్న 1,706 చిన్ననీటి చెరువుల్లో సుమారు 1,500 వరకు నీటి నిల్వలు లేక బీడు భూములను తలపిస్తుండటాన్ని బట్టి చూస్తే జిల్లాలో ఎంతటి దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయో అవగతమవుతోంది. భూములు ఉన్నా సేద్యం చేయలేక చేసిన పనికి నష్టాలు వస్తుండటంతో బతుకులు బీడు భూముల్లానే మాడిపోతున్నాయి. భూయజమానులే భూములను బీడుగా వదిలి వలసపోయే పరిస్థితి మెట్ట ప్రాంతాల్లో చోటుచేసుకుంటోంది. ఈ కరవు జిల్లాపై ఇకనైనా అధికారులు, ప్రభుత్వం దృష్టి సారించకపోతే మరో నెలలో తాగునీటి ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉంది. ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఆర్ ముత్యాలరాజు ఆధ్వర్యంలో అన్ని మండలాల్లో ప్రత్యేక బృందాలచే నివేదికలు తయారు చేయించారు. అంతేకాకుండా మూడు నెలల క్రితం జిల్లాకు వచ్చిన కరవు బృందం కూడా గత ఏడాది ప్రకటించిన 15 కరవు మండలాల్లోనూ పర్యటించింది. ఈ క్రమంలో జిల్లా అధికారులు తయారు చేసిన నివేదికలను ఆ బృందానికి అందచేశారు. ఇటు పరిశీలనతో పాటు జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడటంతో జిల్లాలో తడ మండలం మినహా మిగిలిన 45 మండలాలను రాష్ట్ర ప్రభుత్వం కరవు మండలాలుగా ప్రకటించింది. గత ఏడాది కరవు మండలాలుగా ప్రకటించిన చోటే ఇంతవరకూ నివారణ చర్యలు తీసుకోలేదని, ఇప్పడు కరవు మండలాలుగా ప్రకటించినంత మాత్రాన ఒరిగేదేమీ లేదని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను రైతులు సైతం సమర్థిస్తుండటం గమనార్హం. ఈ ఏడాది వర్షాలు కురవడం లేదు. జిల్లాలో సాధారణ వర్షపాతం 1,080.4 మిల్లీమీటర్ల వర్షపాతం కాగా ఖరీఫ్‌లో కురవాల్సింది 331.3 మిల్లీమీటర్లు. మే, జూన్, జూలై మాసాల్లో సరాసరిన 75.7 మిల్లీమీటర్లు వర్షపాతం లోటు నమోదైంది. జిల్లాలో సరిగా వర్షాలు కురవకపోవడంతో వేసిన పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొంది. ఇప్పటికే చాలాచోట్ల పంటలు ఎండుముఖం పట్టాయి. జిల్లా పరిస్థితుల ఆధారంగా ఈ వ్యవధిలో వర్షాలు కురిస్తే రైతులు కొంతవరకైనా గట్టెక్కుతారు. ఈ ఏడాది ఆ పరిస్థితులు కానరావడం లేదు. దీంతో ఏ రకంగానైనా సాగునీరు అందుబాటులో లేదు. ఇక రిజర్వాయర్‌లు సైతం ఖాళీ అవుతున్నాయి.కర్నాటక, మహారాష్టల్రో కృష్ణానది ఎగువ ప్రాంతాల్లో కురిసిన వరదలకు శ్రీశైలం జలాశయానికి భారీగానే వరదవచ్చింది. పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని విడుదల చేయడంతో సోమశిలకు నీరొస్తాయని ఆశలు పెట్టుకున్న జిల్లా రైతాంగం ఆశ ఆవిరైపోయింది. ప్రస్తుతం శ్రీశైలంలో 870.8 అడుగుల నీటిమట్టంతో 144 టిఎంసీల మేర నీటినిల్వలు ఉన్నాయి. జలాశయ నీటిమట్టం 854 అడుగులకు చేరగానే బ్యాక్‌వాటర్‌ను జిల్లాకు తీసుకువచ్చే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం ఆ దిశగా ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. ప్రభుత్వం హంద్రీనీవా, కెసి కెనాల్‌కు ఇస్తున్న ప్రాధాన్యత ఇటు సోమశిలకు కానీ, తెలుగుగంగ ప్రాజెక్ట్‌కు కానీ ఇవ్వడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఇంకాస్త వరద వస్తే తప్ప సోమశిల వైపు కనె్నత్తి చూసేందుకు కూడా ప్రభుత్వం ఇష్టపడటం లేదని జిల్లా రైతాంగం వాపోతోంది. తమిళనాడుకు నీటి పేరుతో నీటిని తీసుకుంటూ సోమశిల ఎగువ ప్రాంత రిజర్వాయర్లలో వాటిని సర్దుబాటు చేస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. సోమశిలలో 10.86 టిఎంసిల నీరు మాత్రమే ఉంది. ఇందులో 7.5 టిఎంసిలు నీటినిల్వపోను కేవలం 2.5 టిఎంసిల నీరు మాత్రమే వినియోగానికి అందుబాటులో ఉంటుంది. ఇప్పుడు తీవ్రంగా ఎండలు కాస్తుండటంతో అవి కూడా ఆవిరైపోయే ప్రమాదం కూడా ఉంది. కండలేరు డెడ్‌స్టోరేజీ చేరుకుంది. జిల్లాలో సాగునీటితో పాటు తాగునీటి ఎద్దడి కూడా తీవ్రరూపం దాల్చే పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ఆత్మకూరు, గూడూరు, కావలి డివిజన్‌లలోని పలు మండలాల్లోని గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, స్పందించి జిల్లావాసులు ఎదుర్కొంటున్న సాగు, తాగునీటి ఇబ్బందులను తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.