నిర్లక్ష్యం వీడరా..? (విజయనగరం) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

నిర్లక్ష్యం వీడరా..? (విజయనగరం)

పార్వతీపురం, ఆగస్టు 21 (way2newstv.com): 
సిబ్బంది నివాసగృహాలు నిర్మించి ఏళ్లు గడుస్తున్నా, అవి ప్రారంభించకపోవడం వల్ల ప్రభుత్వంపై పరోక్షంగా ఆర్థిక భారం పడుతోంది. నివాసగృహాలు కేటాయిస్తే, అందులో ఉన్న వారికి ప్రత్యేకంగా ఇంటి అద్దె అలవెన్సులు ఇవ్వాల్సిన పని ఉండదు. పురపాలక సంఘాల్లో ఇంటి అద్దె అలవెన్సులు ఇతర ప్రాంతాల కంటే ఎక్కువగా ఉంటుంది. సగటున ఒక్కొ ఉద్యోగికి రూ.3 వేలు నుంచి రూ.10వేలు వరకు ఇంటి అద్దె అలవెన్సు చెల్లించాల్సి వస్తుంది. వీటిని ప్రారంభించి, ఉద్యోగులకు కేటాయిస్తే నెలకు రూ.లక్ష వరకు ఖజానాకు ఆదాయం మిగులుతుంది. పార్వతీపురం ఐటీడీఏలో పనిచేస్తున్న ఉద్యోగులకు నివాస గృహాలు నిర్మించేందుకు ప్రభుత్వం రూ.రెండు కోట్లు కేటాయించింది. ఈమొత్తంలో ఇరవై గృహాలు నిర్మాణం పూర్తిచేయాలని సూచించింది. 
నిర్లక్ష్యం వీడరా..? (విజయనగరం)

అయితే ఖర్చు కొంత పెరగడం వల్ల మరో రూ.60లక్షలు అవసరమయ్యాయి. ఈమొత్తాన్ని కూడా మంజూరుచేయించారు. మొత్తం రూ.2.60కోట్లు వెచ్చించి గృహసముదాయాన్ని పూర్తి చేశారు. ఇప్పటికి పనులన్నీ పూర్తయి ఏడాదిన్నర గడిచిపోతుంది. వాటిని ప్రారంభించకుండా తాళాలు వేసి ఉంచేశారు. ఎవరు వినియోగించకపోవడం వల్ల ఈభవనాల్లో బట్టలు ఆరబెట్టుకొనేందుకు వినియోగిస్తున్నారు. కలుపు మొక్కలు భవనాలు చుట్టూ పెరిగి శిథిలగృహాలను తలపిస్తున్నాయి. ప్రారంభించకపోవడానికి పెద్ద కారణాలు కూడా కనిపించడంలేదు.నిర్మాణ పనులు చేస్తున్నపుడు కాంట్రాక్టర్ విద్యుత్తును వినియోగించుకున్నారని, దీనికి సంబంధించిన బిల్లులు రూ.60 వేలు వరకు చెల్లించాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ మొత్తం చెల్లిస్తే తప్ప విద్యుత్తు కనెక్షన్లు ఇళ్లకు ఇవ్వడం కుదరదని ట్రాన్సుకో స్పష్టం చేసినట్లు సమాచారం. ఈమొత్తాన్ని చెల్లించాల్సిందిగా గుత్తేదారుకు ఇంజినీరింగు అధికారులు కోరుతున్నా, స్పందించడం లేదని చెబుతున్నారు. అందువల్ల విద్యుత్తు కనెక్షన్లు ఇవ్వలేని పరిస్థితులు తలెత్తాయి. విద్యుత్తు లేకుండా ఎవరు ఇంటిలో దిగేందుకు సుముఖత వ్యక్తం చేయరు. ఈచిక్కుముడి వీడేవరకు ఈనివాస గృహాలు ఖాళీగా ఉండాల్సిందే. గత పీఓ ఉద్యోగులకు కేటాయించేందుకు లాటరీ తీయడానికి ముందుకు వచ్చినా, ఈసమస్యలు ఉండడం వల్ల అది సాధ్యం కాలేదు.