ఏపీ రాజధాని మారుతుందా... - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఏపీ రాజధాని మారుతుందా...

విజయవాడ, ఆగస్టు 21, (way2newstv.com)
నూతనంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ కి రాజధాని కోసం పెద్ద కసరత్తే నడిచింది. కేంద్రం నియమించిన శివరామకృష్ణన్ కమిటే సుదీర్ఘ కసరత్తు చేసింది. విజయవాడ గుంటూరు ప్రాంతాలు తప్ప ఎక్కడ పెట్టినా మంచిదే అని మరీ మరీ చెప్పింది. దీనికి కారణాలను స్పష్టంగా పేర్కొంది కమిటీ. మూడు పంటలు పండే ప్రాంతం కావడం వరదలు, ప్రకృతి విపత్తులు సంభవించేటప్పుడు నీట మునిగే ప్రమాదం ఉందని హెచ్చరించింది. అయితే చిత్రంగా నాటి చంద్రబాబు సర్కార్ శివరామకృష్ణన్ నివేదికను చెత్త బుట్టలో వేసేసింది. ఆ కమిటీ చేసిన హెచ్చరికలను పెడచెవిన పెట్టేసింది. ఎక్కడైతే కమిటీ వద్దని చెప్పిందో అక్కడే ఎపి రాజధాని అమరావతి అని ప్రకటించి ముప్ఫైవేలకు పైగా పంటభూములను ల్యాండ్ పూలింగ్ పేరుతో తీసుకుని గ్రాఫిక్స్ తో ప్రజలకు ఇదిగో మన భూతల స్వర్గం అని తేల్చింది.
ఏపీ రాజధాని మారుతుందా...

తాజాగా వచ్చిన కృష్ణా వరదలు శివరామకృష్ణన్ కమిటీ హెచ్చరికలు నిజమే అని రుజువు చేశాయి. కర్ణాటక, మహారాష్ట్ర లలో కురిసిన భారీ వర్షాలకు కృష్ణమ్మ పరవళ్ళు తొక్కింది. దశాబ్ద కాలం తరువాత పోటెత్తి ఉప్పొంగింది. అంతే కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పంటలు, గ్రామాలు, లంక గ్రామాలు వరదలో మునిగాయి. అదృష్టం బావుండి కృష్ణకు వరద తాకిడి వచ్చిన సమయంలో అమరావతి పరిధిలోని రెండు జిల్లాల్లో భారీ వర్షాలు లేవు. దాంతో అతి పెద్ద ప్రమాదమే తప్పింది విజయవాడకు. ఇక ఈ అంశాన్ని అధికార విపక్షాలు తమ యధా శక్తి రాజకీయానికి వినియోగించుకున్నాయి. ఆ విషయం పక్కన పెడితే ఇంత ప్రమాదకర ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం భవిష్యత్తు ను ప్రమాదంలో పడేసేలాగే వుంది.శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చిన నివేదికను అధ్యయనం చేయడంతో బాటు నిపుణుల కమిటీ ని ఏర్పాటు చేసి అమరావతి చుట్టూ వరద, వర్షాల ముంపునకు గురికాని ప్రాంతాలను గుర్తించాలి. ముఖ్యంగా ఎలాంటి ప్రకృతి విపత్తులు ఎదురైనా తట్టుకుని నిలబడే ప్రభుత్వ భూమిని అటు ప్రకాశం నుంచి ఇటు పశ్చిమ గోదావరి జిల్లా వరకు పరిశోధించి గుర్తించాలి. లేకపోతే ఏపీలో పరిశ్రమలు, విద్యాసంస్థలు , వైద్య సంస్థలు భవిష్యత్తు వరదలో నిండా మునిగే ప్రమాదం తప్పదంటున్నారు విశ్లేషకులు. దీనిపై విమర్శలు పెద్ద ఎత్తున రావడం తధ్యం. రాజధాని ప్రాతం ఎంపిక నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారంగా గత ప్రభుత్వం మలుచుకుందని ఇన్ సైడ్ ట్రేండింగ్ కి పాల్పడిందని ఇప్పటికే అధికారంలోని వైసిపి సర్కార్ ఆరోపిస్తుంది. నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కలగా మిగలనుందా అనే భయాందోళనలు మొదలయ్యాయి. వివిధ నిర్మాణాలకు అంచనా వ్యయం భారీగా పెంచారన్న ఆరోపణలపై ఇప్పటికే నిపుణుల కమిటీని నియమించిన రాష్ట్ర ప్రభుత్వం, వరద ముంపు ఉందన్న కారణంతో రాజధానిని మరోచోట నిర్మించుకోవడం మేలని భావిస్తోందనే అనుమానాలతో ప్రపంచ శ్రేణి రాజధాని నిర్మాణంపై నీలినీడలు కమ్ముకున్నట్లైంది. భూములిచ్చిన రాజధాని ప్రాంత రైతులు కూడా ఆందోళనకు గురవుతున్నారు. రాష్ట్ర విభజన తరువాత నవ్యాంధ్ర కోసం ప్రపంచ శ్రేణి రాజధాని నిర్మించేందుకు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిపాదించారు. విజయవాడ, గుంటూరు మధ్య రాజధాని అమరావతిని నిర్మించేందుకు ప్రతిపాదించారు. 29 గ్రామాల పరిధిలో 33,527 ఎకరాల భూమిని సమీకరించారు. భూ సమీకరణ విధానం దేశంలోనే తొలిసారిగా అమలు చేయడం విశేషం. రాజధానిని 1.09 లక్షల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదించారు. వౌలిక వసతుల కల్పనకు దాదాపు 62,623 కోట్ల రూపాయల మేర వ్యయం అవుతుందని భావించి ప్రతిపాదనలను కేంద్రానికి పంపారు. అయితే కేంద్రం 1500 కోట్ల రూపాయలు మాత్రమే విడుదల చేసి చేతులు దులుపుకుంది. బ్రిటన్‌కు చెందిన నార్మన్ అండ్ ఫోస్టర్ సంస్థతో హైకోర్టు, సచివాలయం, అసెంబ్లీ ఐకానిక్ భవనాలుగా అభివృద్ధి చేసేందుకు డిజైన్ చేయించింది. అమరావతి నగరానికి మాస్టర్ ప్లాన్‌ను సింగపూర్ రూపొందించగా, పరిపాలనా నగరాన్ని నార్మన్ ఫోస్టర్ సంస్థ డిజైన్ చేసింది. రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధులను సమకూర్చుకునేందుకు 8000 ఎకరాలను విక్రయించేందుకు వీలుగా గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రపంచ బ్యాంక్, ఏఐఐబి 550 మిలియన్ డాలర్ల మేర రుణాన్ని అందచేసేందుకు ముందుకు వచ్చాయి. దాదాపు 39,875 కోట్ల రూపాయల మేర పనులు జరుగుతున్నాయి. 4214 కోట్ల రూపాయల పనులు టెండరు దశలో ఉండగా, మరో 7500 కోట్ల రూపాయల మేర పనులకు టెండర్లు పిలవాల్సి ఉంది. 65 శాతం మేర రహదారులు, 45 శాతం మేర భవనాలు, 25 శాతం మేర అధికారులు, మంత్రులు, ఇతర ఉద్యోగుల భవనాలు పూర్తి అయ్యాయి. వైకుంఠపురంలోఐకానిక్ వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. వివిధ విద్యా సంస్థలకు, ఇతర సంస్థలకు స్థలాలను కేటాయించారు. ఈ దశలో రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చిన వైకాపా రాజధానిలో నిర్మాణాలు నిలిపివేసింది. అంచనా వ్యయాన్ని పెంచి టెండర్లు పిలిచారని, అవకతవకలు జరిగాయని ఆరోపణలు వస్తున్నాయంటూ ప్రస్తుత ప్రభుత్వం నిపుణుల కమిటీని నియమించింది. ఇప్పటికే దాదాపు 2.5 లక్షల కోట్ల రూపాయల మేర అప్పుల్లో ఉండగా, రాజధాని నిర్మాణానికి భారీ నిధులు కేటాయించడం సాధ్యం కాదని రాష్ట్ర ఫ్రభుత్వం భావిస్తోంది. ఈ పరిస్థితుల్లో ప్రపంచ బ్యాంక్, ఏఐఐబీ రుణాలు ఇచ్చే ప్రతిపాదనను విరమించుకున్నాయి. దాదాపు 39 వేల కోట్ల రూపాయల మేర రాజధాని పనులు జరుగుతుండగా, రాష్ట్ర బడ్జెట్‌లో మాత్రం ఈ ఏడాది కేవలం 500 కోట్ల రూపాయలను మాత్రమే కేటాయించడం ప్రభుత్వ వైఖరిని చెప్పకనే చెప్పిందవచ్చు. తాజాగా కృష్ణనది వరద నీరు రాజధాని ప్రాంతంలో చేరడంతో ముంపునకు గురైయ్యే అవకాశం ఉందని మంత్రి బొత్స, మరికొందరు అధికార పార్టీ ప్రముఖులు వ్యాఖ్యానించారు. ముంపు ప్రమాదం ఉన్న ప్రాంతాన్ని రాజధానికి ఎంపిక చేయడం సురక్షితం కాదని, నల్లమట్టి భూములు కావడంతో పునాది ఎక్కువ లోతులో వేయాల్సి ఉంటుందని, అనేక వంతెనలు వంటివి నిర్మించాల్సి ఉంటుందని మంత్రి చెప్పుకొచ్చారు. దీని వల్ల రాజధాని నిర్మాణానికి చాలా వ్యయం అవుతుందని, దీనికన్నా తక్కువ వ్యయంతో మరోచోట రాజధాని నిర్మించుకోవచ్చని చెప్పడంతో అమరావతి ప్రాజెక్టు అటకెక్కించేందుకు దాదాపు రంగం సిద్ధమైనట్లు భావించవచ్చు