చెత్త శుద్ధి కరవు.. (పశ్చిమగోదావరి) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

చెత్త శుద్ధి కరవు.. (పశ్చిమగోదావరి)

ఏలూరు, ఆగస్టు 27 (way2newstv.com): 
దోమల నివారణ అందరి బాధ్యత. ఇంట్లో చెత్తను శుభ్రం చేయడం ఎంత ముఖ్యమో దాన్ని తరలించడం కూడా అంతే. లేదంటే రోగాలను కొనితెచ్చుకున్నట్లే. ప్రస్తుతం జిల్లాలోని పలు ప్రాంతాల్లో రహదారుల వెంబడి చెత్త వేస్తూ నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. ప్రజారోగ్యానికి పెనుముప్పు తెస్తున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటికే పలు ఆసుపత్రుల్లో డెంగీ కేసులు నమోదు కావడం గమనార్హం. మరోవైపు గన్యా జ్వరాలు వెంటాడుతున్నాయి. శివారు ప్రాంతాల్లో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. ఈ నేపథ్యంలో చిన్నచిన్న జాగ్రత్తలు తీసుకోవడంతోపాటు పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటే దోమలను తరిమేయవచ్చు.  ఇంట్లో మరమ్మతులు, ఇతర పనులు చేపట్టిన సందర్భాల్లో వచ్చే వ్యర్థాలను కుప్పలుగా పోసి చివర్లో తరలిద్దామని భావిస్తారు. దీనివల్ల వారికే కాదు చుట్టూ ఉన్న స్థానికులకు ఎంతో ఇబ్బంది కలుగుతుందని తెలుసుకోవాలి. 
చెత్త శుద్ధి కరవు.. (పశ్చిమగోదావరి)

ఈ ప్రాంతంలో వర్షపు నీరు నిలిచి అవి దోమలు పెరగటానికి ఆవాసాలుగా మారతున్నాయి. పోగుపడిన చెత్త, మట్టిని రెండుమూడు రోజులకు ఒకసారి తరలించేలా చర్యలు తీసుకోవాలి.అవసరం లేకుండా చాలా మంది ఇంటి పరిసరాల్లో ఉండే షెడ్డులో, మిద్దెలపై పాత సామగ్రిని వేస్తుంటారు. విరిగిపోయిన ఫర్నిచర్, పరుపులు, పాతకాగితాలు, పుస్తకాలు, టైర్లు ఇలా ఇంట్లో వాడిన ప్రతీ వస్తువు ఇక్కడ కనిపిస్తుంది. అవి దోమలకు ఎంతో అనువుగా మారతాయి. డెంగీకి కారణమయ్యే ఈడిస్‌ దోమలకు ఇవి మరింత అనుకూలం. పాతసామగ్రిని విక్రయించడమో...లేదంటే తొలగించడమో చేయాలి. వర్షాల కారణంగా చాలా కాలనీలు వరదల్లో చిక్కుకున్నాయి. ఇళ్ల చుట్టూ బురద వదలడం లేదు. శివార్లలో చెరువులు పొంగడంతో పలు కాలనీల్లోని పల్లపు ప్రాంతాల్లో నీరు నిలిచింది. తొలగింపునకు అధికారులు కొన్ని చర్యలు తీసుకున్నా ఫలితం అంతంతమాత్రమే. ఈ నేపథ్యంలో ఎవరి ఇంటి చుట్టూ ఉన్న నీటిని వారే తొలగించుకునేందుకు ప్రయత్నించాలి. పరిస్థితి తీవ్రంగా ఉంటే అధికారుల సహాయం కోరాలి. జిల్లాలో వ్యక్తిగత మరుగుదొడ్లు లేనివారు ఇప్పటికీ చాలా మంది ఉన్నారు. వీరంతా బహిరంగ ప్రదేశాలను మల, మూత్ర విసర్జనకు వినియోగిస్తున్నారు. ముఖ్యంగా చెరువు కట్టలు, రైల్వే ట్రాక్‌లు, రహదారుల అంచులను బహిర్భూమిగా వాడుతున్నారు. దీనివల్ల అంటువ్యాధులు విజృంభిస్తున్నాయి. టైఫాయిడ్, డయేరియా, కలరా లాంటి వ్యాధులు రావడానికి ఇది ఒక కారణమని వైద్యులు చెబుతున్నారు.   చిన్నచిన్న చిట్కాలతో దోమలకు అడ్డుకట్ట వేయవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. దోమల నివారణకు రసాయన పదార్థాలను ఎక్కువగా వినియోగిస్తుంటారు. ఇంట్లో కాయిల్స్, వెలిగించి తలుపులు మూయడం వల్ల ఆ పొగ పీల్చితే శ్వాసకోశ ఇబ్బందులు వస్తాయి. ఇంట్లో రసాయనాలు పిచికారీ చేయడం వల్ల సమస్యలు తప్పవు.  నీరు నిల్వ ఉన్న గుంతల్లో 100 గ్రాముల వేప పిండిని చల్లడం వల్ల దోమల సంతతిని అరికట్టవచ్చు. వేప నూనె 200 మిల్లీ లీటర్లు, కిరోసిన్‌ 100 మిల్లీ లీటర్లు కలిపి దీపం వెలిగించాలి. ఆ దీపం పొగ ద్వారా వెలువడే వాసనకు దోమలు చేరవు. నిద్రకు ఉపక్రమించేందుకు కొంత సమయం ముందే ఇలా చేయాలి. తద్వారా ఆ పొగను మనం పీల్చకుండా చూసుకోవచ్చు. వేప, ఆవ లేదంటే నువ్వుల నూనెను కొబ్బరి నూనెలో కలిపి ఆ మిశ్రమాన్ని నిద్రపోయే ముందు కాళ్లు, చేతులు, శరీరానికి రాసుకోవాలి. ఆ వాసన ప్రభావంతో దోమలు కుట్టవు.