ఆదాయం లేక అల్లాడుతున్నమేదరి కళ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఆదాయం లేక అల్లాడుతున్నమేదరి కళ

విజయనగరం, ఆగస్టు 7, (way2newstv.com)
మారుతున్న కాలంతోపాటు పెరుగుతున్న యాంత్రిక జీవనంలో కులవత్తులు, చేతివత్తులతో తయారీ చేసే వస్తువుల వాడకం నానాటికీ తగ్గిపోతోంది. దీంతో ప్రాచీనకాలం నుండి ఆనవాయితీగా వస్తూ పర్యావరణానికి మేలు చేసే వస్తువుల వినియోగం తగ్గిపోయి చేతివత్తులు మరుగున పడిపోతున్నాయి. అలాంటి కోవకు చెందిన 'మేదరి కళ' నేడు అంతరించిపోతోంది. ప్లాస్టిక్‌ వాడకం పెరగడంతో వీరి జీవనోపాధి దెబ్బతింటోంది. దీంతో చేసేదిలేక గిట్టుబాటు కాకపోయినా అదే వృత్తిని నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. ఒకప్పుడు పల్లెల్లో ఏ ఇంట్లో చూసినా మేదరి కులస్తులు వెదురుకర్రతో తయారు చేసిన వస్తువులే కన్పించేవి. జిల్లాలో వందలాది కుటుంబాలు వెదురు వస్తువుల తయారీపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. 
ఆదాయం లేక అల్లాడుతున్నమేదరి కళ

ప్రస్తుతం పట్టణాలతోపాటు పల్లెల్లో సైతం ప్లాస్టిక్‌ వాడకం పెరగడంతో వెదురు వస్తువుల వాడకం పూర్తిగా తగ్గిపోయింది. పొద్దంతా కూర్చుని వివిధ వస్తువులను తయారు చేస్తే మార్కెట్‌లో వాటి వాడకం తగ్గడంతో కుటుంబాల పోషణ భారమవుతోంది. వీరంతా వెదురు కర్రను కొనుగోలు చేసి, వివిధ రకాల వస్తువులను అల్లుతారు. నాటి పల్లె జీవనంలో వెదురు వస్తువుల వినియోగంపల్లె ప్రజల జీవనంలో ఒకప్పుడు చాటలు, తట్టలు, బుట్టలు, పెళ్లిళ్లలో సారె పెట్టెలు, పశువుల కొట్టాల చుట్టు తడకలు, వాకిట్లో కోళ్ల గూళ్లు, ఇంట్లో ఉట్లు, విసన కర్రలు, మేక పిల్లల గూళ్లు, పొలాల్లో ఎరువులు జారవేసేందుకు, పండించిన ధాన్యం తెచ్చుకునేందుకు ఉపయోగించే చేటలు, ధాన్యాలు నిల్వ ఉంచుకునే గుమ్ములు దర్శనమిచ్చేవి. కానీ ప్రస్తుత సమాజంలో ఇవి మచ్చుకైనా కన్పించడం లేదు. ఆధునిక సమాజంలో కొత్త కొత్త వస్తువులు అందుబాటులోకి రావడంతో జనం వాటిపైనే మక్కువ చూస్తున్నారు. దీంతో మేదరులు తయారు చేసిన వస్తువులకు గిరాకీ లేకుండాపోతోంది. చివరకు పల్లెవాసులు సైతం హంగుహర్భాటాలకు పోవడంతో మేదరుల ఉపాధికి తీవ్ర విఘాతం కలుగుతోంది.పల్లెల్లో సైతం ప్లాస్టిక్‌ వస్తువుల వినియోగం భారీగా పెరిగింది. నేడు పల్లెల్లో ఏ ఇంట్లో చూద్దామన్న వెదురు వస్తువులు దర్శనమివ్వడం లేదు. వ్యవసాయంలో యంత్రాల ఉపయోగం పెరిగినప్పటి నుండి గుమ్ములు, చేటలు, తడకలు లాంటి వస్తువులు కనిపించకుండా పోయాయి. పర్యావరణానికి మేలు చేసే వస్తువుల వాడకాన్ని ప్రోత్సహించి ప్లాస్టిక్‌ వస్తువుల వాడకాన్ని తగ్గించి తమ జీవనోపాధి దెబ్బతినకుండా చూడాలని, తమను ఆదుకోవాలని మేదరులు కోరుతున్నారు.మేదర బతుకులను ప్రభుత్వం గుర్తించలేదు. దేశంలోని అన్ని రాష్టాల్లోనూ మేదర్లను ఎస్సీలుగా వర్గీకరించారు గానీ ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణాల్లో మాత్రమే బీసీలుగా కొనసాగుతున్నారు. అడవులకెళ్లి వెదురుతోపాటు, మరికొన్ని చెట్ల ఆకుల్ని నరికి తెచ్చుకొని జీవనశైలికి అనుగుణంగా వస్తువులుగా మలచి అమ్ముకుని జీవించే కులవృత్తి మేదర్లది. వ్యవసాయానికి అనుబంధంగా రైతు కుటుంబాలకు దగ్గరగా బతుకువెళ్లదీసే ఈ కులవృత్తిదార్లకు ఆదాయం కరువై బతుకు భారమై మరో వృత్తిలోకి తరలిపోతరలిపోతున్నారు. క్రమంగా కొందరు చదువుకొని చిన్నా చితకా ఉద్యోగాల్లోకి మళ్లుతున్నారు. ఆదరణ కురువైనా ఏదో బతుకులు వెళ్లదీద్దామంటే పెనుభూతంలా ప్లాస్టిక్‌ వచ్చిపడి కడుపుకాల్చేసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వండివార్చుకొనే జిబ్బి సైతం కుక్కర్లొచ్చాక అల్లడం మానుకోవాల్సిన వచ్చిందని బాధను వ్యక్తీకరిస్తున్నారు. చేట, గంప, కొల్లం, వెదురునిచ్చెన, బుట్టలు, తట్టలు, చంద్రికలు, కోళ్లు మూసుకొనే కొళ్లం, తడికెలు, మైలబుట్టలు, ధాన్యం దాచుకొనే గాదెలు సైతం కనుమరుగై పోవడంతో మేదర బతుకులు చితికిపోయాయి. సాంప్రదాయాల మాటున పెళ్లిళ్లు, పేరంటాలు, పండగలు, పబ్బాలు జరుగుతున్నపుడు అరకొరగా వెదురు వస్తువుల్ని వాడుతున్నారు.