గోదావరి వరదలపై అధికారులతో ముగిసిన సీఎం సమీక్ష - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

గోదావరి వరదలపై అధికారులతో ముగిసిన సీఎం సమీక్ష

రాజమండ్రి ఆగష్టు 8 (way2newstv.com):
గోదావరి వరదలపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధికారులతో  సమీక్ష జరిపారు. ధవళేశ్వరంకు ఎగువన ఉన్న దేవీపట్నం సహా ఇతర ప్రాంతాల్లో వరద పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.  గోదావరిలో 10–11 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చినా పెద్దగా ముంపు ఉండేదికాదని, కాఫర్డ్యాం కారణంగా ముంపు పెరిగిందని  ఎమ్మెల్యేలు వివరించారు. ధవళేశ్వరం వద్ద నీటిమట్టాన్ని ప్రామాణికంగా తీసుకోకుండా పోలవరం వద్ద ప్రస్తుతం నిర్మిస్తున్న ప్రాజెక్టు వద్ద నీటిమట్టాన్ని పరిగణలోకి తీసుకుని, దానికి  అనుగుణంగా ముందుజాగ్రత్తలు తీసుకోవాలన్న సీఎం సూచించారు. వచ్చే వరద, ముంపునకు గురయ్యే ప్రాంతాలను పరిగణలోకి తీసుకుని ఆమేరకు పోలవరం పునరావాస పనులు చేపట్టాలని సీఎం ఆదేశించారు. 
గోదావరి వరదలపై అధికారులతో ముగిసిన సీఎం సమీక్ష

ముంపుబాధిత ప్రాంతాల్లోని కుటుంబాలకు ఇప్పుడిస్తున్న సహాయం కాకుండా అదనంగా రూ.5వేల రూపాయల చొప్పున సహాయం చేయాలని ఆదేశించారు. పునరావాస శిబిరాల్లో ఉంటున్నవారికి భోజనాలు, ముంపు బాధితులకు నిత్యావసర వస్తువులు పంపిణీయే కాకుండా అదనంగా రూ.5వేల సహాయం చేయాలని అన్నారు. ఇళ్లునష్టపోయినా, పంట నష్టపోయినా  వీటికి నిబంధనల ప్రకారం అందే సహాయం కాకుండా ప్రత్యేకంగా రూ.5వేల ఆర్థిక సహాయం చేయాలి. ముంపునకు గురైన ప్రాంతాల్లో దాదాపు 70శాతానికిపైగా గిరిజన గ్రామాలున్నాయి. వరదల కారణంగా వారి జీవనోపాథి దెబ్బతింది, అందుకనే ప్రత్యేకంగా ఈ రూ.5వేల రూపాయలు సహాయం అందించాలని అన్నారు. మానవతా దృక్పథంతో గిరిజనులను ఆదుకోవాల్సి ఉన్నందునే ఈ నిర్ణయమని అన్నారు. ముంపునకు గురైన గ్రామాలకే కాకుండా, వరదల కారణంగా సంబంధాలు తెగిపోయి ఇబ్బందులు పడుతున్న గ్రామాలకూ నిత్యావసర వస్తువులు పంపిణీచేయాలి. పంటలు దెబ్బతిన్న ప్రాంతాల్లో పరిహారం కాకుండా ఉచితంగా విత్తనాలు పంపిణీ చేయాలని అన్నారు. పోలవరం ప్రాజెక్టుకోసం సేకరించిన భూముల్లో సాగుచేసిన పంటలు కూడా వరదల కారణంగా దెబ్బతింటే.. అక్కడ వారికీ పరిహారంతోపాటు ఉచితంగా విత్తనాల సబ్సిడీ ఇవ్వాలని అన్నారు. రాజమండ్రి విమానాశ్రయంలోని ఏటీసీ టవర్ బిల్డింగులో జరిగిన ఈ సమీక్షలో  డిప్యూటీ సీఎంలు పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్లనాని, మంత్రులు కన్నబాబు, విశ్వరూప్, అనిల్కుమార్ యాదవ్, రంగనాథరాజు, ఎంపీ మార్గాని భరత్ ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, ధనలక్ష్మి, బాలరాజు, కారుమూరి నాగేశ్వర్రావు, కొట్టు సత్యనారాయణ పాల్గోన్నారు.