చిత్తూరు, అక్టోబర్ 1 (way2newstv.com):
ఆరుగాలం శ్రమించే అన్నదాతకు అన్నీ కష్టాలే. అప్పు చేసి.. ప్రకృతిలో ఒడిదొడుకులు ఎదుర్కొని పంట సాగుచేస్తే.. దిగుబడికి ధర లేక రైతన్నలు దిగాలు చెందుతున్నారు. చెరకు పంటకు ధర ఆశాజనకంగా ఉన్నా.. బకాయిలు అందక బావురు మంటున్నారు. బకాయిలు వస్తే పంట సాగుకు చేసిన అప్పులు చెల్లిద్దామని తలచిన రైతన్న.. పది నెలల పాటు నిరీక్షించి.. చివరకు సహనం కోల్పోయి రోడ్డెక్కాడు. అయినా యాజమాన్యాలకు కనికరం కలగలేదు. జిల్లాలోని తూర్పు మండలాల్లో ఉన్న రెండు చక్కెర కర్మాగారాలు రైతులకు రూ.80.6 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. సహకార రంగంలో రెండు, ప్రైవేటు రంగంలో మూడు కర్మాగారాలు ఉన్నాయి. సహకార రంగంలో నడుస్తున్న చిత్తూరు, గాజులమండ్యంలోని ఫ్యాక్టరీలు మూతపడ్డాయి.
చేదెక్కిన చెరకు (చిత్తూరు)
ప్రస్తుతం మూడు ప్రైవేటు ఫ్యాక్టరీలు నడుస్తున్నాయి. వీటిని నమ్ముకొని జిల్లాలో రైతులు చెరకు సాగు చేస్తున్నారు. తూర్పు మండలాల్లో ఎక్కువగా చెరకు సాగు చేస్తున్నారు. రైతులు పంటను కర్మాగారాలకు తరలిస్తుంటారు. అదే పశ్చిమ మండలాల రైతులు చెరకుతో బెల్లం తయారు చేసి అమ్ముకుంటారు. ఏడాది పాటు చెరకు సాగు చేసి ఫ్యాక్టరీలకు తరలిస్తే బిల్లులు చెల్లింపులో యజమానులు అనురిస్తున్న తీరు రైతులకు శాపంగా మారింది. వాస్తవానికి కర్మాగారానికి తరలించిన 15 రోజుల్లోపు బిల్లులు చెల్లించాలి. కొందరు రైతులకు 10 నెలలు అవుతున్నా బిల్లులు రాలేదు. బీఎన్‌కండ్రిగ మండలంలోని మయూరీ ఫ్యాక్టరీ యాజమాన్యం బిల్లులు చెల్లించలేదని రైతులు తిరుపతిలో ఇప్పటికే మూడు దఫాలు ధర్నాలు చేశారు.నిండ్రలోని చక్కెర కర్మాగారం యాజమాన్యం ఫిబ్రవరి 22 వరకే బిల్లులు చెల్లించింది. ఈ ఏడాది దాదాపు 3.75 లక్షల టన్నుల చెరకు క్రషింగ్ చేశారు. సంక్రాంతి వరకు టన్నుకు రూ.2,615 చెల్లించే విధంగా ఒప్పదం కుదుర్చుకున్నారు. అనంతరం ఫ్యాక్టరీకి తరలించిన రైతులకు రూ.2,675 చెల్లిస్తామని హామీ ఇచ్చారు. మార్చి ఆఖరు వరకు కర్మాగారం నడిచింది. ఇంకా దాదాపు రూ.50 కోట్ల వరకు రైతులకు బిల్లులు చెల్లించాల్సి ఉంది. క్రషింగ్ ప్రారంభంలో చెరకు తరలించిన కొందరికీ టన్నుకు రూ.1500లే చెల్లించారు. మిగిలిన మొత్తం ఇంకా చెల్లించలేదు. ప్రకృతి అనుకూలించక పోవడం.. పంట దిగుబడి వచ్చినా మద్దతు ధర లేకపోవడం.. పెరిగిన కూలీ, రవాణా ఖర్చులతో ఏటా పంట విస్తీర్ణం తగ్గిపోతోంది. 2014-15 సంవత్సరంలో చెరకు సాగు 25,345 ఎకరాలు ఉండగా.. 2018-19 సంవత్సరంలో 10,345 ఎకరాలకు పడిపోయింది. అంటే సగానికి పైగా పంట విస్తీర్ణం తగ్గిపోయినట్లు అర్థం అవుతోంది. బకాయిల కోసం ఆందోళనలు చేస్తున్నా జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడంలేదని రైతులు వాపోతున్నారు. ఏటా అధికారులు సమావేశం నిర్వహించి ఫ్యాక్టరీకి చెరకు తరలించిన నెల రోజుల్లో బిల్లులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.జిల్లాలోని చక్కెర కర్మాగారాల్లో 2014-15 ఆర్థిక సంవత్సరంలో మద్దతు ధర రూ.2260 చెల్లించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఏడాది టన్నుకు రైతులకు 2325 చెల్లించారు. 2015-16లో ప్రభుత్వం రూ.2360 చెల్లించాలని నిర్దేశించగా.. ఫ్యాక్టరీ యాజమాన్యాలు 2360 చెల్లించాయి. 2016-17 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ మద్దతు ధర ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో సంక్రాంతి ముందు రూ.2540, అనంతరం రూ.2775 చెల్లించారు. 2017-18 ఆర్థిక సంవత్సరంలో క్రషింగ్ ప్రారంభ సమయంలో రూ.2675, అనంతరం రూ.2775, మార్చి తరువాత రూ.2875 చెల్లించారు. 2018-19 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం టన్నుకు రూ.2612 చెల్లించాలని నిర్ణయించింది. కర్మాగారాల యాజమాన్యాలు క్రషింగ్ ప్రారంభ సమయంలో రూ.2615 చెల్లించగా, సంక్రాంతి తరువాత రూ.2715 చెల్లించాలని నిర్ణయించాయి.