తెలంగాణకు ఆరు ఎయిర్ పోర్టులు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

తెలంగాణకు ఆరు ఎయిర్ పోర్టులు

న్యూఢిల్లీ, డిసెంబర్ 13, (way2newstv.com)
తెలంగాణకు మరో ఆరు కొత్త విమానాశ్రయాలు రాబోతున్నాయి. ఈ మేరకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొత్త విమానాశ్రయాల కోసం ఎరోనాటికల్ సర్వేను చేపట్టాలని విమానాశ్రయ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఎఐ)ను కేంద్రం ఆదేశించింది. ప్రస్తుతం తెలంగాణలో రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం మాత్రమే ఉంది. రాష్ట్ర విభజన సందర్భంగా హైదరాబాద్ పదేళ్ళ పాటు తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్‌కు ఉమ్మడి రాజధానిగా కొనసాగుతుందని విభజన చట్టంలో పొందుపరిచారు. దీంతో ఆంధ్రప్రదేశ్ కూడా రాజీవ్‌గాంధీ విమానాశ్రయాన్ని పదేళ్ళ పాటు పంచుకుంటుంది. అయితే ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్టణం, విజయవాడ, తిరుపతి, కడప, ఓర్వకల్, రాజమండ్రి తదితర ప్రాంతాల్లో ఇప్పటికే కేంద్రం విమానాశ్రయాలను ఏర్పాటు చేసింది.
తెలంగాణకు ఆరు ఎయిర్ పోర్టులు

ఇందులో విశాఖపట్టణం, విజయవాడ, తిరుపతి విమానాశ్రయాలు అంతర్జాతీయ విమానాశ్రయాలుగా కొనసాగుతున్నాయి. కానీ తెలంగాణకు శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ విమానాశ్రయం తప్ప మరెక్కడ విమానాశ్రయాలను కేంద్రం ఏర్పాటు చేయలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కొత్తగా విమానాశ్రయాలను ఏర్పాటు చేయాల్సిందిగా ముఖ్యమంత్రి కెసిఆర్ పలువురు కేంద్రానికి లేఖలు రాశారు. ప్రధాన మంత్రి నరేంద్రమోడీని, సంబంధిత కేంద్ర మంత్రులను స్వయంగా కలిసిన సందర్భాల్లోనూ కెసిఆర్ వినతి పత్రాలను కూడా సమర్పించారు. పార్లమెంట్ సమావేశాల్లోనూ టిఆర్‌ఎస్ పక్షాన ఆ పార్టీ ఎంపిలు అనేక సందర్భాల్లో తెలంగాణలో కొత్తగా విమానాశ్రయాలను ఏర్పాటు చేయాలని కేంద్రంపై పలుమార్లు ఒత్తిడి తీసుకొచ్చారు. దీంతో తెలంగాణలో కొత్తగా ఆరు ప్రాంతాల్లో విమానాశ్రయాలను ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. వీటిల్లో మూడింటిని అంతర్జాతీయ విమానాశ్రయాలుగా తీర్చిదిద్దనుంది. కాగా ఈ మూడు విమానాశ్రయాల కోసం 2018లోనే పనిచేస్తున్న మూడు ఎయిర్ స్ట్రిప్స్‌ను అప్‌గ్రేడ్ చేయడానికి తెలంగాణలో ప్రదేశాలను గుర్తించింది.వాటిల్లో నిజామాబాద్ జిల్లాలోని జకరన్‌పల్లిలో, మహబూబ్‌నగర్ జిల్లాలోని అదకల్ మండలంలో, భద్రాద్రి కొత్తగూడెం తదితర ప్రాంతాల్లో హరిత విమానాశ్రయాలుగా ఏర్పాటు చేయనున్నారు. అలాగే వరంగల్, ఆదిలాబాద్‌తో పాటు పెద్దపల్లి జిల్లాలోని బసంత్‌నగర్‌లో ప్రస్తుతం ఉన్న మూడు ఎయిర్‌స్ట్రిప్స్‌ను బ్రౌన్పీల్డ్ విమానాశ్రయాలుగా అభివృద్ధి చేయనుంది. వరంగల్ ఎయిర్‌స్ట్రిప్‌లో ప్రస్తుతం 706 ఎకరాల్లో విమానాశ్రయం కోసం రెండు రన్‌వేలు ఉన్నాయి. అలాగే పెద్దపల్లిలోని ఎయిర్‌స్ట్రిప్స్‌లో సుమారు 288 ఎకరాల విస్తీర్ణం కలిగి ఉంది. కొత్త్త విమానాశ్రయాలు సిద్దంకాగానే అవి పూర్తిస్థాయీలో పనిచేస్తాయి.దీంతో హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రస్తుతం ఎదుర్కొంటున్న ప్రయాణికుల భారాన్ని కొంత మేరకు తగ్గించడానికి అవకాశం ఏర్పడనుంది. కాగా కొత్తగా ఏర్పాటు చేస్తున్న విమానాశ్రయాలను రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ఉత్తర ప్రాంతం ప్రజల కోసం ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టు, తూర్పు ప్రాంత ప్రజల కోసం భద్రాద్రి కొత్తగూడెం ఎయిర్‌పోర్టు, పశ్చిమ ప్రాంతాల ప్రజలకు కోసం వీలుగా మహబూబ్‌నగర్‌లో ఎయిర్‌పోర్టులను ఏర్పాటు చేయనున్నారు. మొత్తానికి కేంద్రంలో కదలిక రావడంతో తెలంగాణలోని అన్ని ప్రాంతాల ప్రజలకు త్వరలోనే విమానాశ్రయాలు అందుబాటులోకి రానున్నాయి.