గుంటూరు, జనవరి 1, (way2newstv.com)
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పరిస్థితి ఇప్పుడు ముందు నుయ్యి.. వెనక గొయ్యి అన్న చందంలా తయారయింది. ఉన్న 23 మంది ఎమ్మెల్యేలు తలోదారి పడుతున్నారు. లెక్క చేయడం లేదు. క్రమశిక్షణ చర్యలు తీసుకుందామనుకుంటే ఉన్న ప్రతిపక్ష హోదా ఊడిపోయే ప్రమాదం ఉంది. మొన్న వల్లభనేని వంశీ…నిన్న మద్దాలి గిరి ఇలా వరసబెట్టి ఎమ్మెల్యేలు పార్టీ మారకుండా తనపై విమర్శలు చేస్తున్నా సరిపెట్టుకోవాల్సి వస్తుంది. చంద్రబాబు నలభై ఏళ్ల జీవితంలో ఇటువంటి పాలిటిక్స్ ను ఎప్పుడూ చూడలేదంటున్నారు.పార్టీ నచ్చకపోతే రాజీనామా చేయాలి. వేరే పార్టీ కండువా కప్పేసుకోవాలి. కానీ ఏపీలో మాత్రం పార్టీలు మారుతున్నట్లు అనధికారికంగా వెల్లడిస్తున్నారు. కానీ సాంకేతికంగా ఆ పార్టీలోనే ఉంటున్నారు. దీంతో చంద్రబాబుకు ఏం చేయలేని పరిస్థితి.
తలోదారిలో తెలుగు తమ్ముళ్లు
గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాలిగిరి ముఖ్యమంత్రి జగన్ ను కలిసి వచ్చిన తర్వాత నియోజకవర్గ అభివృద్ధి కోసమేనని చెప్పారు. అంతవరకూ బాగానే ఉన్నా చంద్రబాబు విధానాలను తీవ్రంగా మద్దాలి గిరి విమర్శించారు. చంద్రబాబు చుట్టూ ఉన్న కోటరీ మాటలు విని ఆయన తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు.మద్దాలి గిరి చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసినా ఏమి చేయలేని పరిస్థితి చంద్రబాబుది. ఇటీవల వల్లభనేని వంశీ పార్టీ అధినేత నుంచి లోకేష్ వరకూ తీవ్ర విమర్శలు చేశారు. దీంతో వల్లభనేని వంశీకి చంద్రబాబు షోకాజ్ నోటీసు ఇచ్చింది. అయితే దీనికి సమాధానం చెప్పిన వంశీ అనధికారికంగా వైసీపీలో కొనసాగుతున్నారు. ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకోలేకపోతున్నారు. స్పీకర్ కు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేదు. ఎందుకంటే ఇప్పటికే వంశీని స్వతంత్ర సభ్యుడిగా గుర్తించారు.ఇప్పుడు మద్దాలి గిరి విషయంలోనూ షోకాజ్ నోటీసు ఇస్తే వంశీ ఎపిసోడ్ పునరావృతమవుతుందని చంద్రబాబుకు తెలియంది కాదు. మద్దాలి గిరి స్వప్రయోజనాల కోసమే పార్టీని విడిచి వెళ్లారని టీడీపీ నేతలతో విమర్శలు చేయించడం తప్ప చేయగలిగిందేమీ లేదు. నిజానికి మద్దాలిగిరికి దగ్గరుండి టిక్కెట్ ఇప్పించింది గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్. ఆయన అమెరికాలో ఉండగా మద్దాలిగిరి జంప్ అయ్యారు. గల్లా జయదేవ్ అమెరికా నుంచి వచ్చిన తర్వాత మద్దాలి గిరి విషయంలో ఒక నిర్ణయానికి వస్తానంటూ చంద్రబాబు చెబుతున్నది చూస్తుంటే అంత తేలిగ్గా తనపై ఆరోపణలు చేసిన వారిపై చర్యలు చేసిన దుస్థితిలో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద ఎమ్మెల్యేలను కట్టడి చేయడం చంద్రబాబుకు ఈ టర్మ్ కష్టంగానే ఉంది.