బ్యాంకు మోసాలకు అడ్డుకట్ట ఎప్పుడు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

బ్యాంకు మోసాలకు అడ్డుకట్ట ఎప్పుడు

జనవరి 25 (way2newstv.com)
దేశంలో బ్యాంకు మోసాలు పెరిగాయని భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బిఐ) తాజా వార్షిక నివేదిక నిగ్గు తేల్చిన కఠోర వాస్తవం కలవరపరుస్తున్నది. మన ఆర్థిక రంగానికి మంచి రోజులు ఎన్నటికీ రావనే నిరాశకు దారి తీస్తున్నది. పంజాబ్ నేషనల్ బ్యాంకు (నీరవ్ మోడీ), గీతాంజలి గ్రూప్ (మెహుల్ చోక్సీ), ఐడిబిఐ (ఎయిర్ సెల్ మాజీ ప్రొమోటర్ సి శివశంకరన్), పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోపరేటివ్ (పిఎంసి) బ్యాంకు వంటి కుంభకోణాలు, అంతకు ముందు భారీగా బ్యాంకు రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన కింగ్ ఫిషర్ విజయ్ మాల్యా వంటి ఘరానా మోసగాళ్ల ఉదంతాలు దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేశాయి.కాంగ్రెస్ హయాంలో ఆర్థిక నేరాలు రికార్డు బద్దలు గొట్టాయని ఎద్దేవా చేసి తాము ఆ దుస్థితిని తొలగిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన బిజెపి సారథ్యంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం కూడా ఈ బ్యాంకు మోసాల ఉధృతికి అడ్డుకట్ట వేయలేకపోయిందని సందేహాతీతంగా నిరూపణ అవుతోంది. 
బ్యాంకు మోసాలకు అడ్డుకట్ట ఎప్పుడు

బ్యాంకు శ్కాంలను వీలైనంత తొందరగా గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని పాలకులు చేసిన వాగ్దానం గాలికి పేల పిండిలా ఎగిరిపోయింది. ప్రభుత్వం ఏమి చర్యలు తీసుకున్నదోగాని వాటి ఫలితం మాత్రం పెదవి విరుపేనని రుజువవుతున్నది. ప్రజలు తమ కష్టార్జితాన్ని చిన్న చిన్న పొదుపు ఖాతాల్లో దాచుకుంటున్న సొమ్ము వేలాది కోట్ల రూపాయలకు చేరుకుంటున్నది. దానినంతటినీ మూటగట్టి బడా చోర్లకు ఫలహారంగా అర్పించడమే విధ్యుక్త ధర్మంగా బ్యాంకులు నడుచుకుంటున్నాయి.బ్యాంకు మోసాలు అంతకు ముందరి సంవత్సరం కంటే 201819 లో 15 శాతం పెరిగాయని రిజర్వు బ్యాంకు నివేదిక నిగ్గు తేల్చింది. గడచిన ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు మోసాల్లో ఇరుక్కున్న మొత్తం 73.8 శాతం పెరిగింది. 201718లో రూ. 41,167.04 కోట్ల కిమ్మత్తు గల 5916 కేసులు బయటపడగా, 201819లో రూ. 71,542.39 కోట్ల మేరకు 6801 కేసులు నమోదయ్యాయి. నీరవ్ మోడీ కేసు బయట పడిన తర్వాత బ్యాంకు మోసాలు చోటు చేసుకున్న అనంతరం వీలైనంత తొందరగా వాటిని గుర్తించి బయటపెట్టాలని రిజర్వు బ్యాంకు గట్టి ఆదేశాలిచ్చింది. అయినా పరిస్థితిలో మార్పు రాలేదు. బ్యాంకుల సిబ్బంది, ఘరానా మోసగాళ్ల మధ్య అక్రమ బంధం మరింత బిగుసుకున్నదని స్పష్టపడుతున్నది. మోసాలను గుర్తించడానికి బ్యాంకులు సగటున 22 మాసాల సుదీర్ఘ వ్యవధి తీసుకుంటున్నాయి.ఎప్పటి మాదిరిగానే గత ఏడాది కూడా మోసాల జాబితాలో పబ్లిక్ రంగ బ్యాంకులే పై చేయిని సాధించాయి. తదుపరి స్థానంలో ప్రైవేటు బ్యాంకులు, మూడవ స్థాయిలో విదేశీ బ్యాంకులున్నాయి. మోసాలను అరికట్టడంలో విదేశీ బ్యాంకులు గణనీయమైన ప్రగతిని సాధించడం దేశీయ బ్యాంకుల చేతగాని తనాన్ని చాటుతున్నది. మోసాల కేసుల్లో 60 మంది ఎస్‌బిఐ సిబ్బందిని, 49 మంది హెచ్‌డిఎఫ్‌సి, 35 మంది యాక్సిస్ బ్యాంకు, 20 మంది పంజాబ్ నేషనల్ బ్యాంకు ఉద్యోగులను సస్పెండ్ చేశారు. జూన్ 2018 నాటికి దేశంలోని అన్ని బ్యాంకుల వసూలు కాని రుణ బకాయిలు రూ. 10 లక్షల కోట్లకు చేరుకున్నదంటే ప్రజాధనం దోపిడీ ప్రజాస్వామ్య పాలకుల కనుసన్నల్లోనే ఎంత దారుణంగా జరిగిపోతున్నదో అర్థం చేసుకోవచ్చు.మోసానికి గురైన లేదా తిరిగి చెల్లించకుండా పేరుకుపోయిన రుణ బాకాయిల్లో రూ. లక్ష లోపు కిమ్మత్తు గలవి కేవలం 0.1 శాతం మాత్రమే కావడం గమనించాలి. గత్యంతరం లేని పరిస్థితుల్లో సాధారణ రుణ గ్రహీతలు ఎగ్గొడుతున్న లోన్ల కిమ్మత్తు బహు తక్కువ కాగా, ఆర్థిక బలం, అధికార శ్రేణుల మద్దతు గల ఐశ్వర్య వంతులు చేస్తున్న బ్యాంకు దగాలే అత్యధికమని బోధపడుతున్నది. వీరిని గుర్తించడం, కేసులు పెట్టడం, శిక్షలు పడేలా చేయడం అసాధ్యంగా రుజువు చేసుకుంటున్నదనీ వెల్లడవుతున్నది. ఘరానా మోసాలు ఎగవేతల కారణంగా బ్యాంకులు దివాలా తీయకుండా ఆదుకోడానికి కేంద్ర ప్రభుత్వం తన బడ్జెట్‌లో వందలాది కోట్ల రూపాయలు కేటాయిస్తున్నది. ఆర్థిక సంవత్సరంలో బ్యాంకులను ఆదుకోడానికి సమకూర్చిన అదనపు పెట్టుబడి కింద ప్రధాని మోడీ ప్రభుత్వం రూ. 1.6 లక్షల కోట్లు సమకూర్చింది. గత జులై నెలలో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో ఇందుకోసం రూ. 70,000 కోట్లు పక్కనపెట్టారు. ఈ విధంగా దేశ ప్రజల శ్రమ రాబడితో నడుస్తున్న బ్యాంకులను ఘరానా దొంగలు కొల్లగొట్టడం ఆ లోటును ప్రభుత్వం తన వద్ద ఉన్న ప్రజాధనంతో పూడ్చడం ఒక విష వలయంగా తయారయింది. అధికారంలో ఉన్నవారి అండదండలతోనే సాగిపోతున్నదని భావించక తప్పని ఈ భారీ దోపిడీ దేశ ఆర్థిక రంగాన్ని విపరీతంగా గాయపరుస్తున్నది. దొడ్డి దారిలో వందలు, వేల కోట్ల రూపాయలు కాజేసే అవకాశమున్న చోట పారిశ్రామిక రంగం కూలబడడం ఆకలి, దారిద్య్రాలు పేరుకుపోడం సహజం