విజయవాడ, ఆగస్టు 21 (way2newstv.com)
ఏపీ రాజధానిని తరలిస్తారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. అమరావతిపై మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలతో ఈ ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో రాజధాని విషయంలో కొత్త డిమాండ్ తెరపైకి వచ్చింది.. ఒకవేళ రాజధానిని మార్చాలనుకుంటే రాయలసీమలో ఏర్పాటు చేయాలంటున్నారు ఆ ప్రాంత నేతలు. వైసీపీ ఎమ్మెల్యేలతో పాటూ సీనియర్ రాజకీయ నేతలు కూడా ఇదే డిమాండ్‌ను వినిపిస్తున్నారు. కర్నూలు జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేలు రాజధాని విషయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
రాయలసీమ రాజధానిపై జోరుగా ప్రచారం
ఓ మీడియా ఛానల్‌తో మాట్లాడిన ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఆర్థర్‌లు.. శివరామకృష్ణ కమిటీ నివేదికను పట్టించుకోకుండా చంద్రబాబు రాజధాని విషయంలో నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. రాజధానిని మార్చాలని నిర్ణయం తీసుకుంటే కర్నూలులో రాజధాని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అమరావతిలో కొనసాగిస్తే.. కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేయాలంటున్నారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అమెరికా పర్యటన నుంచి రాగానే ఇదే విషయాన్ని చెబుతామంటున్నారు. వైసీపీ ప్రభుత్వం రాజధానిని దొనకొండకు మార్చడం ఖాయమని వ్యాఖ్యానించారు మాజీ ఎంపీ చింతా మోహన్. ఓ మీడియా ఛానల్‌తో మాట్లాడిన ఆయన.. రాజధాని మార్పుపై కేంద్రంతో జగన్ చర్చించారని.. త్వరలోనే ఓ నిర్ణయం తీసుకోబోతున్నారని చెప్పుకొచ్చారు. రాజధాని విషయంలో తొందరపాటు పనికిరాదని.. దొనకొండ ప్రాంతం సరైంది కాదని అభిప్రాయపడ్డారు. రాయలసీమలో అన్ని వనరులతో ఉన్న తిరుపతిని రాజధాని చేయాలని డిమాండ్ చేశారు.
Tags:
Andrapradeshnews