తిరుమల, సెప్టెంబర్ 7, (way2newstv.com)
5 నెలల్లో రూ.497.27 కోట్లు. 524 కిలోల బంగారం, 3వేల 98 కిలోల వెండి. ఏంటి ఈ లెక్కలు అనుకుంటున్నారా.. ఇదంతా పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం. అవును.. వడ్డీకాసుల వాడి హుండీ కలెక్షన్స్ భారీగా పెరిగాయి. రికార్డ్ స్థాయిలో కానుకలు, డొనేషన్లు వచ్చాయి. తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం వివరాలను టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ వెల్లడించారు. 2018 ఏప్రిల్-ఆగస్టు మధ్య రూ. 450.54 కోట్ల ఆదాయం హుండీ ద్వారా లభించగా.. 2019లో ఏప్రిల్-ఆగస్టు మధ్య రూ. 497.29కోట్లు లభించిందన్నారు. అలాగే 2018 ఏప్రిల్- ఆగస్టు మధ్య 344 కిలోల బంగారం, 1,128 కిలోల వెండి కానుకలుగా లభించగా.. 2019లో 524 కిలోల బంగారం, 3వేల 98 కిలోల వెండి సమకూరినట్లు వివరించారు.కానుకలే కాదు డొనేషన్లు కూడా భారీగానే వచ్చాయి.
తిరుమలకు భక్తుల వెల్లువ
భక్తులు పెద్ద మొత్తంలో విరాళాలు ఇచ్చారు. టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న 10 ట్రస్టులకు, ఒక స్కీమ్‌కు గత మూడేళ్లలో వచ్చిన విరాళాలను పరిశీలిస్తే ఏటేటా గణనీయంగా పెరుగుతున్నాయని అనిల్ కుమార్ సింఘాల్ చెప్పారు. 2017 ఏప్రిల్-ఆగస్టు మధ్య రూ. 91.91కోట్లు, 2018 ఏప్రిల్-ఆగస్టు మధ్య రూ. 113.96 కోట్లు విరాళాల రూపంలో లభించగా 2019 ఏప్రిల్-ఆగస్టు మధ్య రూ.140.46కోట్లు లభించాయన్నారు. ఒక్క ఆగస్టు నెలలోనే హుండీ ఆదాయం రూ.113.71 కోట్లు, అద్దె గదుల నుంచి రూ.6.9కోట్ల ఆదాయం వచ్చినట్టు ఈవో తెలిపారు. శ్రీవాణి ట్రస్టు ద్వారా అందుతున్న విరాళాలను ఎస్సీ, ఎస్టీ గ్రామాల్లో శ్రీవారి దేవాలయాల నిర్మాణానికి వినియోగిస్తున్నట్లు వివరించారు. డిసెంబర్ కి సంబంధించి 68వేల 466 ఆర్జిత సేవా టిక్కెట్లు అందుబాటులో ఉన్నట్లు ఈవో తెలిపారు. ఆన్‌లైన్ డిప్ విధానం ద్వారా సుప్రభాతం-3,856, తోమాల-60, అర్చన-60, అష్టదళపాద పద్మారాధన-240, నిజపాద దర్శనం-2,300, సాధారణ కోటాలో విశేషపూజ-2,500, కల్యాణోత్సవం-13,775, ఊంజల్‌సేవ-4,350, ఆర్జిత బ్రహ్మోత్సవం-7,975, వసంతోత్సవం-15,950, సహస్రదీపాలంకరణసేవ-17,400 టిక్కెట్లు ఉన్నాయి.2018 ఆగస్టు నెలలో 19లక్షల 16వేల 752 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా.. 2019 ఆగస్టులో 24లక్షల 02వేల 801 భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారని ఈవో తెలిపారు. గతంలో పోలిస్తే ఇది 25.4శాతం ఎక్కువ. దర్శనాల విషయంలో టీటీడీ తీసుకొచ్చిన సంస్కరణల వల్లే ఇది సాధ్యమైందని ఈవో వెల్లడించారు.లడ్డూ విక్రయాల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. ఏకంగా 37.6శాతం పెరుగుదల నమోదైంది. 2018 ఆగస్టు నెలలో 81 లక్షల 52వేల 432 లడ్డూలు విక్రయించగా.. 2019 ఆగస్టు నెలలో కోటి 12లక్షల 13వేల 854 లడ్డూలు విక్రయించినట్టు ఈవో తెలిపారు. అన్నప్రసాదం కూడా రికార్డే. 2018 ఆగస్టుతో పోలిస్తే 21.7శాతం పెరిగింది. 2018 ఆగస్టులో 43 లక్షల 32వేల 238కి అన్నదానం చేయగా, 2019 ఆగస్టులో 52లక్షల 73వేల 605మందికి అన్నదానం చేశారు. తలనీలాలు సమర్పించుకున్న భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2018 ఆగస్టులో 7లక్షల 90వేల 749మంది తలనీలాలు సమర్పించగా.. 2019 ఆగస్టు నెలలో 10లక్షల 95వేల 656 మంది తలనీలాలు ఇచ్చారని ఈవో తెలిపారు
Tags:
Andrapradeshnews